- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ-కామారెడ్డి: జిల్లాలోని వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలతో పంటలు తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక మహిళా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరించాలని సూచించారు.
రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు వేగంగా అందేలా ట్యాబ్ ఎంట్రీలు, డేటా అప్డేషన్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారాల్లో కూడా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించబోమన్నారు.
ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడంతో పాటు రూ.45 వేల కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు నేల సారవంతత దెబ్బతింటుందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
నేటి నుండి మహిళా సాధికారిత వారోత్సవాలు
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. రేపటి నుండి మహిళా సాధికారిత కార్యక్రమాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి మే 25 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారిత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లొ మహిళల భద్రతపై అవగాహన, పోషణ కార్యక్రమాలు, అంగన్వాడీ సేవల బలోపేతం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, బాల్య వివాహాల నివారణ, మహిళల ఆరోగ్య పరీక్షలు, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాలు, మండలాలు, పట్టణ స్థాయిలో అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఎన్వీ గిరి , పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డి ఎం శ్రీకాంత్, డిఆర్డిఓ దామోదర్ రెడ్డి, రైస్ మిల్లర్స్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



