Monday, May 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు

- Advertisement -

తెలంగాణ మహిళా సాధికారతకు కొత్త దిశ
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే సంకల్పం
ఆదాయ వనరులు కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. ఒకప్పుడు కేవలం పొదుపు సంఘాలుగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు ప్ర‌జా ప్ర‌భుత్వ ప్రొత్సాహంతో ఇప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామ్య శక్తులుగా ఎదుగుతున్నాయి. ఆడబిడ్డలను సంక్షేమ లబ్ధిదారుల స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం, పోషణ, పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మహిళా వారోత్సవాల సందర్భంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖలు, సెర్ప్, మెప్మాల ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రదర్శనలు, ఆరోగ్య శిబిరాలు, యువతులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహిళా సాధికారత కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళలను లబ్ధిదారుల స్థాయి నుంచి పారిశ్రామిక వెత్తలుగా, సంపద సృష్టికర్తల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో బ్యాంక్ లింకేజీ ద్వారా లక్ష కోట్ల రూపాయల రుణ సదుపాయం కల్పిచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రూ.60,487 కోట్ల రుణాలు అందించారు. వీటి ద్వారా లక్షల సంఖ్యలో మహిళలు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.1,397 కోట్ల వడ్డీ రాయితీ మహిళా సంఘాలకు ప్రభుత్వం చెల్లించగామహిళా వారోత్సవాల్లో మరో రూ.650 కోట్లను చెల్లించనున్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమం ద్వారా మహిళలను స్వయం ఉపాధి రంగంలో బలోపేతం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 222 మహిళా సంఘాల క్యాంటీన్లు ఏర్పాటు కాగా ఒక్కో యూనిట్ నెలకు సగటున రూ.72 వేల వరకు లాభాలు ఆర్జిస్తోంది. మహిళల నిర్వహణలో పెట్రోల్ బంకులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు యూనిట్లు ప్రారంభం కాగా మరో 30 పెట్రోల్ బంకుల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. మహిళా సమాఖ్యలు రూ.199 కోట్ల పెట్టుబడితో 553 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి అద్దె ప్రాతిపదికన టీజీఎస్ఆర్టీసీకి అందించాయి. ఒక్కో బస్సు ద్వారా నెలకు సుమారు రూ.70 వేల వరకు ఆదాయం లభిస్తోంది. అలాగే వరి కొనుగోలు కేంద్రాలు, పాల విక్రయ కేంద్రాలు, మైక్రో వ్యాపారాలు, ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థల ద్వారా మహిళలు ఆదాయం పెంచుకుంటున్నారు. గ్రామీణ మహిళలను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సెర్ప్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రైతులు పండించిన పంటలను మధ్య దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మహిళా సంఘాల ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పీఓలు) దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమవుతున్నాయి. మామిడి, మిర్చి, పసుపు, కంది వంటి పంటలను రిటైల్ చైన్‌లు, ఈ-కామర్స్ వేదికలు, ఎగుమతి మార్కెట్లకు సరఫరా చేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు. మహిళా రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ, గ్రేడింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్రిసాట్ సంస్థతో కలిసి ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్లలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు కేటాయించగా మహిళా వారోత్సవాల సందర్భంగా 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అలాగే రూ.110 కోట్ల వ్యయంతో 22 జిల్లాల్లో నిర్మిస్తున్న “ఇందిరా మహిళా శక్తి భవనాలు” మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలవనున్నాయి.

​నేడు 8 వేల ఐఎంఎస్ భవనాలకు శంకుస్థాపనలు మే 25న రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు ఒకేసారి శంకుస్థాపనలు జరగనున్నాయి. 26న మహిళా సమాఖ్యలకు స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో కొనుగోలు చేసిన 553 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర స్థాయిలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన బస్సులు జిల్లాల వారీగా టీజీఎస్ఆర్టీసీకి అనుసంధానమవనున్నాయి. 27న వికారాబాద్, మధిర ప్రాంతాల్లో మహిళా సమాఖ్యలకు మంజూరైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. 29న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాలను విస్తరించే లక్ష్యంతో జిల్లా స్థాయిలో లోన్ మేళాలు నిర్వహించనున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, వ్యవసాయేతర రంగాల్లో కొత్త జీవనోపాధి యూనిట్లను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ భవన్‌లో ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. మే 30న ‘అమ్మకు అక్షరమాల’ ద్వారా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా, మండల స్థాయిలో సన్మానించనున్నారు. అదే రోజు స్నేహ బాలికల కోసం జిల్లా కేంద్రాల్లో మాక్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహించి నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -