‘ఎండ’ ప్రచండం…

రాష్ట్రంలో ఇప్పటికే వడదెబ్బతో ఇరవై రెండు మందికి పైగా చనిపోయినట్టు
వార్తలు. గురువారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతిచెందారు. ఎండలు
మండిపోతుండడంతో దాహార్తిని తట్టుకోలేక దప్పిక తీర్చుకునేందుకు
శీతల పానీయాలను ఎక్కువగా సేవిస్తున్నారు. వడగాలులకు భయపడి
దుకాణదారులు కూడా మధ్యాహ్నం షాపులు మూసి వేసి మళ్లీ
సాయంత్రం తెరుస్తున్నారు. తప్పనిసరిగా ఒక వేళ ఎండలో వెళ్లాల్సి వస్తే
తలకు టోపి, కాటన్‌తో తయారు చేసిన తెల్లటి వస్త్రాలు ధరించాలి.
ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త‌
అవసరం. నీరు ఎక్కువగా తీసుకోవడం, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ
వంటివి తాగితే ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందొచ్చు.
సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు. తన ప్రతాపంతో ఎండిపచండం చేస్తున్నాడు. జనం బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. వేడిగాలులకు తోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల అకాల వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ నాలుగు రోజులుగా మళ్లీ నిప్పుల వర్షం కురుస్తోంది. రోజురోజుకూ ఈ తీవ్రత పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ కూడా జారీ చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో తమ పనుల్ని పూర్తి చేసుకుంటున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు నానాతంటాలు పడాల్సి వస్తోంది. చాలామంది దూర ప్రయాణాలు, బంధువుల కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎండ తీవ్రత ప్రజల ఉపాధిపైనా ప్రభావం చూపుతుండటం విచారకరం.
పగటిపూట ఎండవేడి తట్టుకోలేక జనం ఇండ్లల్లోనే ఉండటంతో రహదారులు, చౌరస్తాలు వెలవెల బోతున్నాయి. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే ప్రాంతాలైన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలు, పార్కులు, సిగల్‌ కూడళ్లు, అబిడ్స్‌, కోఠి, మదీనా మార్కెట్‌, సుల్తాన్‌బజార్‌లు సైతం నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రతకు గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు చాలా అవస్థలు పడుతున్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. అలసట తీర్చుకునేందుకు నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో టెంట్లు వేయాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కార్మిక సంఘాల డిమాండ్‌. కానీ పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులకు రోజూ పని చేస్తే తప్ప పూట గడవదు. వీరంతా ఎండలో పనిచేస్తూ అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే వడదెబ్బతో ఇరవై రెండు మందికి పైగా చనిపోయినట్టు వార్తలు… గురువారం ఒక్కరోజే ఎనిమిది మంది మరణాలను చూస్తుంటే ఎండ తీవ్రతకు నిదర్శనం. ఈ పరిస్థితిని చూస్తుంటే మున్ముందు ఇంకెన్ని చావులు చూడాలోననే ఆందోళన కలుగుతోంది. ఎండలు మండిపోతుండడంతో దాహార్తిని తట్టుకోలేక దప్పిక తీర్చుకునేందుకు శీతల పానీయాలను ఎక్కువగా సేవిస్తున్నారు. వడగాలులకు భయపడి దుకాణదారులు మధ్యాహ్నం షాపులు మూసి వేసి మళ్లీ సాయంత్రం తెరుస్తున్నారు. షాపింగ్‌ చేసేవాళ్లు కూడా రాత్రి సమయంలో తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. తప్పనిసరిగా ఒక వేళ ఎండలో వెళ్లాల్సి వస్తే తలకు టోపి, కాటన్‌తో తయారు చేసిన తెల్లటి వస్త్రాలు ధరించాలి. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త అవసరం. నీరు ఎక్కువగా తీసుకోవడం, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగితే ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతలను అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పడు వెల్లడిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వా లను ముందే హెచ్చరించారు. అధిక వేడి తగలకుండా ముందస్తు ప్రణాళికలు, తగినచర్యలు తీసుకోవాల్సిన సూచనలూ చేశారు.
ప్రధానంగా వాతావరణ మార్పులకు ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తులు కారణంగా చెప్పొచ్చు. పరస్పర విరుద్ధ వాతావరణాలైన ఎల్‌నీనో, లానీనా! (ఇవి రెండు స్పానిష్‌ పేర్లు) భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్‌ మహా సముద్రం ఉపరితలంపై అసాధారణ వేడి, చల్లదనం నమోదవుతుంటాయి. దీన్ని సదరన్‌ ఆసిలేషన్‌ సిస్టమ్‌ (ఈఎన్‌ఎస్‌ఓ) అంటారు. ఎల్‌నీనో అయితే అత్యధిక వేడి, తక్కువ వర్షపాతం, లానినాలో వర్షాలు అధికం. ఈ రెండు పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నాలుగైదేండ్లకు భ్రమణంలో ఈ రెండు పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయని శాస్త్రవేత్తల విశ్లేషణ. ఆ రకంగా భారత్‌లో 90శాతం భూభాగం వేడికి గురయ్యే అవకాశముందని అంచనా. అయితే అధిక వేడి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాలకులు పెడచెవిన పెడుతూ వస్తున్నారు. సహజ వనరులు కార్పొరేట్లకు అప్పగించడంతో అడవుల నరికివేత, పర్యావరణ విధ్వంసం, మైనింగ్‌ తవ్వకాలు విచ్చలవిడిగా పెరిగాయి. అదేస్థాయిలో వాతావరణంలోనూ మార్పులు చోటుచేసుకుని అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Spread the love