నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’తో ఆయన దర్శకుడిగా మారారు. ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ అలరించారు. ‘యువ’, ‘సీత కత్తి’, ‘ఈశ్వరన్’, ‘సర్’, ‘తిరు’, ‘మహారాజా’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. 1977లో వచ్చిన ’16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతిని మార్చేసింది. శ్రీదేవి, రజినీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ చేయగా ఇక్కడా ఘన విజయం సాధించింది.
ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్‌లో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కిళక్కే పోగుమ్ రైల్, సిగప్పు రోజాక్కళ్, ముదల్ మరియాదై, వేదం పుదిదు వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలు కూడా క్లాసిక్‌లుగా నిలిచిపోయాయి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి ఎందరో నటీనటులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు.
తెలుగులో సూపర్ హిట్ చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రానికి కథ అందించింది భారతీరాజానే. 1994లో వచ్చిన ‘పల్నాటి పౌరుషం’ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకొకచిలుక’ చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. 1981లో ఈ చిత్రానికి గాను భారతీరాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం వరించింది.



