Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజుల నియంత్రణ చట్టం కోసం టీఆర్ఎస్ పోరుబాట

ఫీజుల నియంత్రణ చట్టం కోసం టీఆర్ఎస్ పోరుబాట

- Advertisement -

చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి
వందలాది మంది తెలంగాణ రక్షణ సేన కార్యకర్తల అరెస్ట్


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పోరుబాట పట్టింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లక్డీకా పూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించారు. గంటకు పైగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ గేట్ ముందు బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్స్ ఒక్కసారిగా వంద శాతం నుంచి 150 శాతం వరకు ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెను భారం మోపినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్స్ కు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అండతోనే కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫీ రీయంబర్స్ మెంట్ పథకానికి మంగళం పాడేందుకు తీసుకువచ్చిన జీవో నం.7ను రద్దు చేయాలని కోరారు. రూ.11 వేల కోట్ల ఫీ రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

​తీవ్ర ఉద్రిక్తత
వందలాది మంది తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించడంతో లక్డీకాపూల్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో నాయకులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆఫీస్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి, నారాయణగూడ, సైఫాబాద్, బండ్లగూడ, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళా నాయకులు గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -