Sunday, July 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్‌ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం

‌ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్థి ఉద్యమ విజయం

- Advertisement -

ఎన్టీఏను రద్దు చేయాలి
వామపక్షవిద్యార్థి సంఘాల డిమాండ్‌
అంబేద్కర్‌ విగ్రహం వద్దవిజయోత్సవ సభ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఐక్యంగా సాగించిన ఉద్యమ విజయానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి, యువతకు జేజేలు ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో విఫలమవుతున్న నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దుయ్యేదాకా పోరాటాలను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌‌లోని ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్‌ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, టి నాగరాజు, పీడీఎస్‌‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్, పీడీఎస్‌‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి మహేష్, పొడపంగి నాగరాజు, ఏఐడీఎస్‌‌వో కేంద్ర సంయుక్త కార్యదర్శి హరీశ్‌ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నితీశ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సీబీఎస్‌ఈ మూల్యాంకనంలో జరిగిన వైఫల్యాలు, సీయూఈటీ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ చేసిన తప్పిదాలు, విద్యా కేంద్రీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధంతో అణచివేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువకులపై లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగాలు చేసిందనీ, పోలీసులు దాడులు చేసి దమనకాండకు పాల్పడ్డారని అన్నారు.

ఈ నిర్బంధాలను ఏమాత్రం లెక్కచేయకుండా ధైర్యంగా ఎదుర్కొని, రక్తాన్ని చిందించి ఉద్యమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, యువకులు పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే పోరాటం ముగియలేదని అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను కాపాడేందుకు విద్యా కేంద్రీకరణ, కాషాయీకరణ విధానాలను పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు, ఎన్టీఏను రద్దు చేసే వరకు, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020)ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని వారు పిలుపునిచ్చారు. మెడికల్‌ ‌సీట్ల భర్తీ కోసం నీట్ వంటి కేంద్రీకృత ప్రవేశ పరీక్షలను రద్దు చేసి, రాష్ట్రాలే ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యను సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాల హక్కుగా పరిరక్షించేందుకు రానున్న రోజుల్లో మరింత విస్తృతమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు ఎం రమ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, జూనుగరి రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు నాగేంద్ర, శ్రీరాం, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావేద్, పీడీఎస్‌‌యూ నాయకులు లోకేశ్‌,హన్మంతు, మహేందర్‌, అంజి, గణేష్‌, అశోక్‌‌కుమార్‌, చందు, ఏఐడీఎస్‌ఓ నాయకులు కళ్యాణ్‌‌కుమార్‌, నాగరాజు, ప్రణవ, సిద్ధార్థ, నిఖిత, కావ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు గడ్డం గౌతం, తిరుపతి, అజయ్‌, ఝాన్సీ, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -