Sunday, July 26, 2026
E-PAPER
Homeజాతీయంలాఠీ ఎత్తొద్దు..ప్రజల పక్షాన నిలవండి

లాఠీ ఎత్తొద్దు..ప్రజల పక్షాన నిలవండి

- Advertisement -

జంతర్‌ మంతర్‌ భద్రతా బలగాలకు 1,800 మంది పౌరుల బహిరంగ లేఖ
పోలీసుల తీరును ప్రశ్నించిన రచయితలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు


న్యూఢిల్లీ : ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఈనెల 20న విద్యార్థులపై జరిగిన పోలీసు బలప్రయోగం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1,800 మందికి పైగా రచయితలు, మేధావులు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, ఆందోళన చెందుతున్న పౌరులు పోలీసు, భద్రతా బలగాలకు బహిరంగ లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై దాడి చేయాలని ఆదేశాలు వచ్చినా వాటిని అమలు చేయవద్దని, ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను తెలుగుతో సహా 15 భారతీయ భాషల్లో విడుదల చేశారు.జంతర్‌ మంతర్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ వీడియోలను చూసిన తర్వాతే ఈ లేఖ రాయాల్సి వచ్చిందని లేఖలో వారు పేర్కొన్నారు. ”సాధారణంగా లేఖలు ‘ప్రియమైన’ అనే సంబోధనతో ప్రారంభమవుతాయి. కానీ మీ చేతుల్లో లాఠీలు ఎత్తి యువ విద్యార్థులను అమానుషంగా కొట్టిన దృశ్యాలు చూసిన తర్వాత మిమ్మల్ని అలా సంబోధించలేకపో తున్నాం” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఎముకలు విరిగిపోవడం, రక్తం కారడం, చిన్నారులు నొప్పితో విలవిల్లాడ డం వంటి దృశ్యాలు చూసి, దాడి చేసిన భద్రతా సిబ్బంది తమ సొంత పిల్లలు, సోదరులు, సోదరీమణుల ముఖాలను అందులో చూడలేకపోయారా అని ప్రశ్నించారు.

వీడియోల్లో పోలీసులతో పాటు సాధారణ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు కూడా లాఠీలు పట్టుకుని రాళ్లు విసురుతూ, నిరసనకారులపై దాడి చేసినట్టు కనిపించిందని లేఖ పేర్కొంది. 10-11 ఏండ్ల పిల్లలు కూడా నొప్పితో అరుస్తున్నా, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కలిగిన భద్రతా బలగాలు వారిపైనే విరుచుకుపడ డం తమ నమ్మకాన్ని దెబ్బతీసిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ”మేము పై అధికారుల ఆదేశాల మేరకే పని చేశాం” అని పోలీసులు చెప్తున్నా.. ఆదేశాలు పాటించడం, నిజమైన విధి నిర్వర్తించడం రెండూ ఒకటి కాదని లేఖ స్పష్టం చేసింది. ప్రపంచ చరిత్రలో అనేక సందర్భాల్లో భద్రతా బలగాలు ప్రజలపై కాల్పులు జరపాలన్న లేదా దాడి చేయాలన్న ఆదేశాలను తిరస్కరించిన ఉదాహరణలను లేఖలో ప్రముఖులు ప్రస్తావించారు. ఆదేశాలు ఇచ్చే నాయకుల పిల్లలు విదేశాల్లో చదువుతున్నారని, కానీ పోలీసు సిబ్బంది పిల్లల భవిష్యత్తు కూడా ఈ దేశ విద్యా వ్యవస్థపైనే ఆధారపడి ఉందని లేఖ పేర్కొంది. ”మీరు కూడా సాధారణ కుటుంబాల నుంచే వచ్చారు. కష్టపడి ఉద్యోగాలు సంపాదించారు.

జీవన పోరాటం చేస్తున్నారు. అందుకే మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులపై దాడి చేయడం బాధ కలిగిస్తోంది” అని లేఖలో పేర్కొన్నారు. లేఖ చివర్లో భద్రతా సిబ్బంది మనస్సాక్షికి విజ్ఞప్తి చేస్తూ.. మరోసారి శాంతియుత నిరసనకారులపై దాడి చేయాలన్న ఆదేశాలు వస్తే ఒక్కసారి ఆలోచించి లాఠీ ఎత్తేందుకు నిరాకరించాలని కోరారు. వందలాది మంది భద్రతా సిబ్బంది ఒకేసారి అలాంటి నిర్ణయం తీసుకుంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వాలు పోలీసు బలగాలను ప్రజలపై ప్రయోగించే పరిస్థితి మారుతుందని పేర్కొన్నారు. ”మీరు కూడా ఈ దేశ పౌరులే. ప్రభుత్వ వైఫల్యాలు మిమ్మల్నీ, మీ పిల్లల భవిష్యత్తునూ ప్రభావితం చేస్తాయి. మా నిరసనల్లో పాల్గనలేకపోయినా, కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే మా రాజ్యాంగబద్ధ హక్కును కాపాడండి” అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -