అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 10,024
బీఆర్‌ఎస్ 7,556, బీజేపీ 5,457
సీపీఐ(ఎం) 284, సీపీఐ 260
కరీంనగర్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 1,257
అత్యల్పంగా వడ్డెపల్లి మున్సిపాల్టీలో 57 నామినేషన్లు దాఖలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘పుర’పోరులో 2,996 వార్డుల్లో పోటీచేసేందుకు 20,313 మంది అభ్యర్థులు 29,694 నామినేషన్లను దాఖలు చేశారు. కొందరు అభ్యర్థులు రెండు, మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ సంఖ్య పెరిగింది. మొదటి రోజు 902, రెండో రోజు 7,403, చివరి రోజైన శనివారం పెద్ద ఎత్తున 21,309 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పూర్తి వివరాలను తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు శనివారం వెల్లడించారు. ఒక్కో స్థానానికి సగటున 9.9 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 10,024, బీఆర్‌ఎస్ నుంచి 7,556, బీజేపీ నుంచి 5,457, సీపీఐ(ఎం) నుంచి 284, సీపీఐ నుంచి 260 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరైన పార్టీల నుంచి 1,645 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3,745 మంది నామినేషన్లను దాఖలు చేశారు.
మజ్లీస్ నుంచి 576, బహుజన సమాజ్ పార్టీ నుంచి 326, ఆప్ నుంచి 50 మంది బరిలో నిలిచారు. టీడీపీ నుంచి 30 మంది, వైఎస్సార్ సీపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. కార్పొరేషన్లలో అత్యధికంగా కరీంనగర్‌లో 1,257, నిజామాబాద్‌లో 976, భద్రాది కొత్తగూడెంలో 801, మహబూబ్‌నగర్‌లో 781, రామగుండంలో 696, మంచిర్యాలలో 615, నల్లగొండలో 581 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మున్సిపాల్టీల్లో అత్యధికంగా సూర్యపేటలో 741 ఆ తర్వాత కామారెడ్డిలో 528, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లిలో 57, ఆ తర్వాత ఆలంపూర్‌లో 59 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రకటించి ఆల్ఫాబేటికల్ వారీగా ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్, అనంతరం 13న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
త్వరిత గతిన ఏర్పాట్లు:ఈసీ
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను త్వరతిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన అధికారులు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి కావాల్సిన బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు ఇతర సామాగ్రి పంపిణీకి గాను 123 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలతో పాటు ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వారీగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపునకు సంబంధించి రవాణా తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
మొత్తం నామినేషన్లు 29,694
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



