Tuesday, May 26, 2026
E-PAPER
Homeజాతీయంమీడియా ప్రశ్నలపైఅసహనం ఎందుకు ?

మీడియా ప్రశ్నలపైఅసహనం ఎందుకు ?

- Advertisement -

మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎడిటర్స్‌ గిల్డ్‌
న్యూఢిల్లీ :
మీడియా ప్రతినిధుల ప్రశ్నల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అసహనంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. నార్వే, నెదర్లాండ్స్‌ దేశాలలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారత అధికారులు, పాత్రికేయుల మధ్య నెలకొన్న వివాదాన్ని ప్రస్తావించింది. యూరోపియన్‌ పాత్రికేయులతో ఘర్షణ పడడం అవమానకరమని, ఇది దేశంలో పత్రికా స్వేచ్ఛ, జవాబుదారీతనంపై ఆందోళన రేకెత్తిస్తోందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. నార్వేలో స్థానిక పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మోడీ నిరాకరించడం వివాదానికి కారణమైందని తెలిపింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే, నెదర్లాండ్స్‌ ప్రధమ, ద్వితీయ స్థానాలలో ఉండగా భారత్‌ 157వ స్థానంలో (మొత్తం దేశాలు 180) ఉన్నదని గుర్తు చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడగాల్సిన అవసరం జర్నలిస్టులకు ఉందన్న నార్వే పాత్రికేయురాలి అభిప్రాయం సరైనదేనని ఎడిటర్స్‌ గిల్డ్‌ తెలిపింది. ప్రధాని మోడీ దశాబ్ద కాలానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క బహిరంగ పత్రికా సమావేశం కూడా నిర్వహించలేకపోవడం విచారకరమని పేర్కొంది. ప్రశ్నించడాన్ని సహించలేని వైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని స్థాయిలలోనూ అంతకంతకూ పెరుగుతోందని చెప్పింది. మీడియాపై ఆంక్షలు మన ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్న వారు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూసేందుకు పాత్రికేయులు ప్రయత్నిస్తారని, కాబట్టి వారిని శత్రువులుగా చూడవద్దని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రకటనపై ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు సంజరు కపూర్‌, ప్రధాన కార్యదర్శి రాఘవన్‌ శ్రీనివాసన్‌, కోశాధికారి తెరెసా రెహమాన్‌ సంతకాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -