Wednesday, May 27, 2026
E-PAPER
Homeజాతీయంబ్రెజిల్‌ వైపు భారత్‌, చైనా చూపు

బ్రెజిల్‌ వైపు భారత్‌, చైనా చూపు

- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా హార్ముజ్‌ జలసంధి మీదుగా ఇంధన వాణిజ్యానికి అడ్డంకులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుకోవాలని భారత్‌, చైనా యోచిస్తున్నాయి. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం కష్టంగా మారింది. దీంతో ఆసియా దేశాలు సురక్షితమైన, విశ్వసనీయమైన సరఫరాదారుల కోసం అన్వేషిస్తున్నాయి. ప్రపంచ దేశాలలో చమురును అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలలో బ్రెజిల్‌ ఒకటి. దీంతో ఆ దేశం నుంచి దిగుమతులను పెంచుకునే దిశగా భారత్‌, చైనా దృష్టి సారించాయి. ఇరాన్‌ యుద్ధం, హార్ముజ్‌ జలసంధి మూసివేత వంటి పరిణామాల నేపథ్యంలో బ్రెజిల్‌ ప్రాధాన్యత పెరిగిందని, అక్కడి నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం ఆసియా దేశాలకు తేలికైన పని అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

గల్ఫ్‌ నుంచి కొనుగోలును కుదించుకుంటూ…
గల్ఫ్‌ నుంచి చమురు సరఫరాలలో సమస్యలు ఎదురవుతుండడంతో భారత్‌, చైనాలు ఇప్పటికే బ్రెజిల్‌ నుంచి కొనుగోళ్లను పెంచాయి. అయితే ఆసియాకు ప్రధాన చమురు సరఫరాదారుగా ఉన్న మధ్యప్రాచ్యం స్థానాన్ని బ్రెజిల్‌ భర్తీ చేయలేదు. కానీ హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో దాని ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. పైగా ఇరాన్‌ నౌకలను అమెరికా దిగ్బంధిస్తోంది. ఈ నేపథ్యంలో సరఫరాలలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి రిఫైనరీలకు బ్రెజిల్‌ చమురు ఆకర్షణీయంగా కన్పిస్తోంది. ఆసియా దేశాలు గత ఏడాది బ్రెజిల్‌ నుంచి రోజుకు 1.2 మిలియన్‌ బ్యారల్స్‌ ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. ఈ సంవత్సరం జనవరి-మే మధ్యకాలంలో అది 1.8 బ్యారల్స్‌కు పెరిగింది. గల్ఫ్‌ నుంచి చమురు కొనుగోలును తగ్గించుకునేందుకు ఆసియా దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇది అద్దం పడుతోంది.

బ్రెజిల్‌లో పెరిగిన ఉత్పత్తి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందే బ్రెజిల్‌ తన చమురు ఉత్పత్తిని పెంచుకుంది. గత సంవత్సరం జనవరి-మే నెలల మధ్య ఆ దేశం రోజుకు 3.77 మిలియన్‌ బ్యారల్స్‌ చమురును ఉత్పత్తి చేయగా ఈ ఏడాది సగటున రోజుకు 4.06 మిలియన్‌ బ్యారల్స్‌ చమురును ఉత్పత్తి చేస్తోంది. ఈ నెలలో అది 4.11 మిలియన్‌ బ్యారల్స్‌కు చేరింది. అయితే బ్రెజిల్‌ ఉత్పత్తి రోజుకు కేవలం 50 వేల నుంచి లక్ష బ్యారల్స్‌ మాత్రమే పెరిగింది. బ్రెజిల్‌ ప్రభుత్వ రంగ కంపెనీ పెట్రోబ్రాస్‌ తన ఎగుమతులను ఎక్కువగా ఆసియా దేశాల వైపు మళ్లిస్తోంది. ఎందుకంటే అక్కడి రిఫైనరీలు ముడి చమురుకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాయి. పెట్రోబ్రాస్‌ ఎగుమతులలో 60 శాతానికి పైగా చైనాకే వెళుతున్నాయి. అమెరికాకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మార్పు బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది. ముడి చమురు ధరల పెరుగుదల బ్రెజిల్‌ వాణిజ్య సమతూకానికి మద్దతు ఇస్తోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారల్‌కు వంద డాలర్లకు చేరితే జీడీపీలో ఒక శాతానికి సమానమైన ఆదాయం లభిస్తుందని బ్రెజిల్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.

2,38,000 బ్యారల్స్‌
మన దేశం జనవరి-మే మధ్యకాలంలో రోజుకు 2,38,000 బ్యారల్స్‌ ముడి చమురును బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన దిగుమతులు రోజుకు లక్ష బ్యారల్స్‌ మాత్రమే. గత నెలలో…భారత్‌కు అత్యధికంగా ముడి చమురును సరఫరా చేస్తున్న దేశాలలో బ్రెజిల్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -