Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంఖాకీ దౌర్జన్యం

ఖాకీ దౌర్జన్యం

- Advertisement -

సీపీఐ(ఎం) కేంద్ర కార్యాల‌యంలోకి ఢిల్లీ పోలీసుల చొర‌బాటు
ఎలాంటి అనుమతి లేదు…
యూనిఫాం లేదు…నేమ్ బోర్డు లేదు
ఎస్ఎఫ్ఐ స‌హాయ కార్య‌ద‌ర్శి ఐషీ ఘోష్‌ అరెస్టుకు య‌త్నం
ప్రయివేట్ వాహ‌నాల్లో సివిల్ డ్రెస్‌లో వ‌చ్చిన పోలీసులు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ పార్టీ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాల‌యంలోకి పోలీసులు చొర‌బ‌డ్డారు. ఎటువంటి అనుమ‌తి తీసుకోకుండా ఎస్ఎఫ్ఐ నేత‌ను అక్ర‌మంగా అరెస్టు చేసేందుకు య‌త్నించారు. అయితే సీపీఐ(ఎం) రాజ్య‌స‌భ ఎంపీ జాన్ బ్రిట్టాస్‌, ఇత‌ర నేత‌లు పోలీసుల‌ను అడ్డుకున్నారు. ప్రయివేట్ వాహ‌నాల్లో వ‌చ్చి సివిల్ డ్ర‌స్‌ల‌తో చొర‌బ‌డ్డారు. అయితే సీపీఐ(ఎం) నేత‌లు అడ్డుకోవ‌డంతో వెనుతిరిగారు. ఢిల్లీ యువజన ఉద్యమంలో ముందుండి పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి, జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్య‌క్షురాలు ఐషీ ఘోష్‌ను సీపీఐ(ఎం) కేంద్ర‌ కార్యాలయం (ఏకేజీ భవన్) నుంచి అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ చర్య విఫలమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఉద్య‌మ‌కారుల‌పై ఉక్కుపాదం మోపేందుకు, బ‌ల‌వంత‌పు చ‌ర్యలు చేప‌ట్టేందుకు మోడీ ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డింది. అందులో భాగంగానే మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఐదేండ్ల నాటి కేసులో కొన్ని నెలల క్రితం పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ కింద ఐషీ ఘోష్‌ను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు. జంతర్ మంతర్ ఉద్యమానికి సంబంధించి యువతను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించినందున, పాత కేసు నమోదు చేసి ఐషీఘోష్‌ను తీహార్ జైలులో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, యూనిఫాం, నేమ్‌ప్లేట్ లేని అధికారి నేతృత్వంలో ప్రయివేట్ వాహనంలో వచ్చిన పోలీసులను ఎంపీలు, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నిబంధనలు పాటించకుండా జాతీయ పార్టీ కేంద్ర‌ కార్యాలయంలోకి చొరబడే అధికారం పోలీసు అధికారులకు ఎవరు ఇచ్చారని సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వును అమలు చేయడానికి వచ్చానని చెప్పిన అధికారిని, జాన్ బ్రిట్టాస్ తన యూనిఫాం, నేమ్‌ప్లేట్ ఎక్కడ ఉన్నాయని ప్ర‌శ్నించారు. వర్షం, రద్దీ కారణంగా తాను యూనిఫాం ధరించలేద‌ని ఆమె చెప్పింది. అయినప్పటికీ, యూనిఫాంలో వచ్చి, నిర్దేశించిన పద్ధతులను పాటించాలని ఆమెకు సూచించారు. దీంతో, ఆ అధికారి, ఆమెతో ఉన్న పోలీసు అధికారులు ఇబ్బందిగా తిరిగి వెళ్లారు. ఐషీ ఘోష్‌ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారన్న వార్త విన్న తరువాత‌, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు ఏకేజీ భవన్‌కు తరలివచ్చారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ఇతర నాయకులు కూడా వెంటనే పార్టీ కేంద్ర‌ కార్యాలయానికి చేరుకున్నారు.

2021లో బంగ్లా భవన్‌కు విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌కు సంబంధించిన కేసులో, ఏప్రిల్ 15న పాటియాలా హౌస్ కోర్టు ఐషీ ఘోష్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నెలలు గడిచినా, ఈ విషయమై ఆమెకు ఎలాంటి సమన్లు లేదా నోటీసులు అందలేదు. గురువారం కోర్టు ఈ కేసును మళ్లీ విచారించాల్సి ఉండగా, మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు ఆమెకు ఫోన్ చేసి వారెంట్ గురించి తెలియజేశారు. మరుసటి రోజు కేసు విచారణకు హాజరైనప్పుడు తాను హాజరవుతానని, బెయిలు లేని వారెంట్‌ను ఉపసంహరించుకోవాలని వెంటనే దరఖాస్తు చేసుకుంటానని ఐషీఘోష్ బదులిచ్చారు. అయినప్పటికీ, ఢిల్లీ పోలీసులు పార్టీ కేంద్ర‌ కార్యాలయానికి వెళ్లి ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ప్రారంభం నుంచి జంతర్ మంతర్ వద్ద యువజన ఉద్యమంలో చురుకుగా ఉన్న ఐషీ ఘోష్, సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు తరువాత నిరాహార దీక్ష కూడా చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -