ఆగస్టు 10న వెయ్యి ప్రాంతాల్లో ఎఫ్‌టీఏకు వ్యతిరేకంగా భారీ నిరసన
17న ప్రధాని, సీఎం సహా పలువురు అధికార, ప్రతిపక్ష నేతలకు
డిమాండ్ పత్రాలు నవంబర్ 26న ఢిల్లీతో పాటు
100 ప్రాంతాల్లో కిసాన్ మార్చ్
ఎస్‌కేఎం అఖిల భారత సదస్సు నిర్ణయం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
విద్యార్థుల ఉద్యమం తరువాత దేశవ్యాప్తంగా రైతులు కూడా వీధుల్లోకి రానున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ)ను ఉపసంహరించుకోవడం, పంటలకు స్వామినాథన్ కమిషన్ ప్రకారం మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించడం, సమగ్ర రుణమాఫీ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం, విద్యుత్ ప్రయివేటీకరణ రద్దు వంటి డిమాండ్లను లేవనెత్తుతూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నవంబర్ 26న కిసాన్ మార్చ్‌లను నిర్వహించనుంది. ఢిల్లీతో సహా 100 కేంద్రాల్లో ఈ ఆందోళన నిర్వహించనున్నారు. మంగళవారం నాడిక్కడ మింటో రోడ్, సివిక్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఎస్‌కేఎం అఖిల భారత సదస్సు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చింది. ఈ సదస్సు రెండు తీర్మానాలను ఆమోదించింది. అందులో మొదటిది.. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన చారిత్రాత్మక రైతు పోరాటంలో అమరులైన 736 మంది రైతుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి సింఘూ సరిహద్దులో తగినంత భూమిని కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరడం, రెండవది.. తీవ్రమైన కరువు, వరదలు, పర్యావరణ సంక్షోభం, అలాగే పంటలు, పశువులు, ఇండ్లు, జీవనోపాధి నష్టాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వ రంగ బీమా సంస్థలతో కూడిన సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థ ఆవశ్యకత.
దేశ వ్యతిరేక ఎఫ్‌టీఏలకు వ్యతిరేకంగా, ఆగస్టు 10న ‘క్విట్ ఇండియా’ ఉద్యమ 84వ వార్షికోత్సవం సందర్భంగా రైతులు దేశవ్యాప్తంగా 1,000 ప్రాంతాల్లో ‘జైల్ భరో’, ‘రైల్ రోకో’, ‘రోడ్ రోకో’ వంటి కార్యక్రమాలతో భారీ నిరసన దినాన్ని పాటించాలని పిలుపు ఇచ్చింది. ఇతర సంఘాలు, వేదికలు మద్దతు ఇవ్వాలని, వారితో ఎస్‌కేఎం సమన్వయం చేసుకోవాలని సదస్సు నిర్ణయించింది. ఆగస్టు 17న ఎస్‌కేఎం ప్రతినిధి బృందాలు ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు డిమాండ్ల పత్రాన్ని సమర్పించి, తమ ప్రధాన డిమాండ్లపై సానుకూల చర్యలు తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. దీర్ఘకాలం పాటు సాగే స్వతంత్ర, సమన్వయ పోరాటాలకు సన్నద్ధమయ్యేందుకు ఎస్‌కేఎం రాబోయే రెండు నెలల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహించనుంది. సభ్య సంఘాలన్నీ సామూహిక పాదయాత్రలు, వాహన జాతాలు, ట్రాక్టర్ ర్యాలీల వంటి స్వతంత్ర, సమన్వయ కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. ఇవి బహిరంగ సభలు, మహా పంచాయతీలు, రాష్ట్ర స్థాయి ర్యాలీలతో ముగిస్తాయని స్పష్టం చేసింది.
అక్టోబర్ 3న ‘లఖింపూర్ ఖేరీ అమరవీరుల దినోత్సవ గ్రామ మహా పంచాయతీ’ జరుగుతుంది. అలాగే, కీలక డిమాండ్లు నెరవేరే వరకు సాగే సుదీర్ఘ పోరాటం కోసం సభ్య సంఘాలు వాలంటీర్ల జాబితాను సిద్ధం చేస్తాయని తెలిపింది. కనీస మద్దతు ధర, రుణ మాఫీతో సహా 2021 డిసెంబర్ 9న ఇచ్చిన లిఖితపూర్వక హామీని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తూ, డిమాండ్ల పత్రాన్ని అంగీకరించకపోతే, ఎస్‌కేఎం పోరాటాలను ఉధృతం చేయనున్నట్టు స్పష్టం చేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన విజయవంతమైన విద్యార్థి పోరాట అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. అలాగే రాబోయే పోరాటాలలో విద్యార్థులు, రైతుల మధ్య మరింత ఐక్యత ఉండాలని పిలుపునిచ్చారు.
డిమాండ్లు
భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వద్దు, అన్ని ఎఫ్‌టీఏల రద్దు, అన్ని పంటలకు సి2+50 శాతం పద్ధతిలో ఎంఎస్‌పీ, ప్రభుత్వ కొనుగోలుకు హామీనిచ్చే చట్టం చేయడం, గ్రామీణ రుణభారాన్ని, రైతులు, కూలీల ఆత్మహత్యలను అరికట్టడానికి సమగ్ర రుణ మాఫీ, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం, నాలుగు కార్మిక చట్టాల రద్దు, కార్మికులందరికీ రూ. 26 వేల కనీస వేతనం, 200 రోజుల పని, రూ. 700 వేతనంతో ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరణ, విద్యుత్ ప్రయివేటీకరణ బిల్లు-2025, విత్తన బిల్లు-2025, ఎన్ఎఫ్ఎస్ఏ సవరణ బిల్లుల ఉపసంహరణ, బలవంతపు భూసేకరణ వద్దు, కార్పొరేట్ అనుకూల భూ సమీకరణ వద్దు, గిరిజనులు, గిరిజనేతర అటవీ నివాసితులకు ఎల్ఎఆర్ఆర్ చట్టం-2013, ఎఫ్ఆర్ఎ చట్టం-2006 ఆధారంగా భూ హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లను ఆమోదించింది.



