Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంనో జాబ్

నో జాబ్

- Advertisement -

పెరిగిన నిరుద్యోగులు
ప్రతి ముగ్గురు యువకుల్లో ఇద్దరు పట్టభద్రులే
​ఇదీ నేటి భారత యువత నిరుద్యోగ ముఖచిత్రం
​అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన
‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రతిపక్షాలు, కేంద్ర గణాంకాలు తేటతెల్లం చేస్తున్నా మోడీ సర్కార్ లైట్ తీసుకుంటోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను దాచి అంకెలతో గారడీ చేస్తూ కాలాన్ని నెట్టుకువస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక.. దేశంలోని యువతరం డిగ్రీలు చేతపట్టుకుని ఏ ఉద్యోగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది. ఉపాధి కోసం భావితరం పడుతున్న ఈ ప్రయత్నం కాస్త ఆగ్రహంగా మారితే మరో యువోద్యమం జరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

న్యూఢిల్లీ : దేశంలో నాలుగు దశాబ్దాలుగా విస్తరించిన ఉన్నత విద్య సాధించిన విజయాలు , వైఫల్యాలకు ఈ గణాంకాల తారుమారే స్పష్టమైన నిదర్శనం. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక ప్రకారం… 1983లో 50 లక్షలుగా ఉన్న 20 నుంచి 29 ఏండ్ల వయస్సు గల పట్టభద్రుల సంఖ్య నేడు 6.3 కోట్లకు పెరిగింది. అదే కాలంలో వారిలో నిరుద్యోగుల సంఖ్య 7 లక్షల నుంచి 1.1 కోట్లకు పెరిగింది. పట్టభద్రుల సంఖ్య 13 రెట్లు పెరిగితే.. ఉద్యోగం లేని పట్టభద్రుల సంఖ్య 16 రెట్లు పెరిగింది.

పెరిగిన నిరుద్యోగం
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక ప్రకారం.. 25 ఏండ్లలోపు వయస్సు ఉన్న పట్టభద్రులలో నిరుద్యోగం 1983లో 35 శాతంగా ఉండగా, 2023లో 39.3 శాతంగా ఉంది. అంటే నాలుగు దశాబ్దాల కాలంలో ఈ సంఖ్య నాలుగు శాతం మాత్రమే మారింది. నిజానికి పెరిగింది ఆ నిరుద్యోగ వర్గంలో ఉన్న వ్యక్తుల సంఖ్య మాత్రమే. యువ పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించలేకపోయింది. వారిని తయారు చేయడంలో (విద్యను అందించడంలో) ఎంతో పురోగతి సాధించినా ఉద్యోగ కల్పనను మాత్రం పరిష్కరించలేకపోయింది.

28 శాతానికి పెరిగిన పట్టభద్రులు
1983లో 20-29 ఏండ్ల వయసున్న భారతీయులలో పట్టభద్రులు నాలుగు శాతం మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వారు 28 శాతానికి పెరిగారు. భారతదేశం వంటి ఆదాయ స్థాయి ఉన్న దేశానికి ఆశించిన స్థాయిలోనే ఉన్నత విద్యలో నమోదు ఉంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ పెరుగుదల అధికంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. అయితే చదువు పూర్తయ్యాక లభించే ఉద్యోగాల రకం మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోయింది. 2004 నుంచి 2023 మధ్య, భారతదేశంలో ఏడాదికి సుమారు 50 లక్షల మంది పట్టభద్రులు చేరారు. వారిలో సుమారు 28 లక్షల మంది ఏదో ఒక రకమైన ఉద్యోగాన్ని పొందగా 17 లక్షల మంది మాత్రమే జీతంతో కూడిన ఉద్యోగాలను సంపాదించారు. నివేదికలోని ప్యానెల్ డేటా ప్రకారం.. తాము నిరుద్యోగులమని ప్రకటించుకున్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు పరిశీలించినప్పుడు యువ పట్టభద్రులలో సగం మంది ఏదో ఒక రకమైన ఉద్యోగాన్ని పొందుతున్నారు. వారిలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే శాశ్వత జీతంతో కూడిన ఉద్యోగాన్ని పొందుతుండగా, 3.7 శాతం మంది వైట్-కాలర్ ఉద్యోగాలను పొందుతున్నారు.

​ప్రాంతాన్నిబట్టి అవకాశాలు
​30 ఏండ్లలోపు పట్టభద్రులైన పురుషులలో నిరుద్యోగం ఢిల్లీలో 8.8 శాతం ఉండగా ఒడిశాలో 40.3 శాతం వరకు ఉంది. పట్టభద్రులైన మహిళలలో ఇది జమ్మూ కాశ్మీర్‌లో 73.5 శాతానికి, తెలంగాణలో 52.3 శాతానికి, ఏపీలో 51.6 శాతానికి చేరుకుంది. జాతీయ గణాంకాల ప్రకారం పురుషులలో 25.1 శాతం, మహిళలలో 36.6 శాతం ఉంది. చాలా రాష్ట్రాలలో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. అయితే మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లలో పురుషుల కంటే మహిళలల్లో పట్టభద్రుల నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. తాజా అధికారిక గణాంకాలు ఈ నివేదికతో పాటు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. 2025 క్యాలెండర్ ఇయర్‌ వరకు కొనసాగే ప్రభుత్వ ఆవర్తన కార్మిక శక్తి సర్వే వార్షిక శ్రేణి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం… అన్ని వయస్సుల వారిలో పట్టభద్రుల నిరుద్యోగం 11.2 శాతంగా (పురుషులలో 9 శాతం , మహిళలలో 17.4 శాతం) ఉంది. యువత గణాంకాలతో పోలిస్తే ఇది చాలా విస్తృతమైన జనాభా. ఇందులో నలభై, యాభై ఏండ్ల వయసులో ఉన్న, చాలావరకు ఉద్యోగాలలో స్థిరపడిన పట్టభద్రులూ ఉన్నారు. ఆ ఉదారమైన ప్రాతిపదికన చూసినా కూడా, పట్టభద్రులైన పురుషుల రేటు కంటే పట్టభద్రులైన మహిళల రేటు దాదాపు రెట్టింపుగా ఉంది.

తగ్గిన పట్టభద్రుల సంపాదన
డిగ్రీ ఇప్పటికీ పొందదగినదే అయినా ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించేటప్పుడు పట్టభద్రుల జీతాలు పట్టభద్రులు కాని వారి కంటే ఎక్కువగా ఉంటాయి. అంతేకాక, పట్టభద్రుల జీతాలు పట్టభద్రులు కాని వారి జీతాలకన్నా రెట్టింపుతో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ ఆధిక్యత తగ్గుతోంది. సుమారు 2017 నుంచి పట్టభద్రుల సంపాదన స్తంభించిపోయింది. కానీ అది పూర్తిగా కనుమరుగవలేదు. డిగ్రీ ఇప్పటికీ ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ ప్రతిఫలం లభించడం మొదలయ్యే ముందు పట్టే నిరీక్షణ, ఆ నిరీక్షణ తర్వాత లభించే మొదటి ఉద్యోగం గతంలో కంటే అధ్వాన స్థితిలో ఉంది. ఈ నిరీక్షణకు నిధులు సమకూర్చే కుటుంబాలకు ఇది చాలా ఖరీదైనది. జాతీయ నమూనా సర్వే యొక్క విద్యా మాడ్యూల్ ప్రకారం.. 2025లో సుమారు 37.8 శాతం సెకండరీ-స్కూల్ విద్యార్థులు ప్రయి వేట్ కోచింగ్‌లో చేరారు.

ప్రాథమిక స్థాయిలో 22.9 శాతంగా ఉన్న ఈ సంఖ్య, ఉన్నత-సెకండరీ విద్యార్థులలో 37 శాతంగా ఉంది. డబ్బు కూడా ఇదే వక్రరేఖను అనుసరిస్తుంది. ఉన్నత మాధ్యమిక విద్యలో ఉన్న పిల్లల కుటుంబాలు 2025లో పాఠశాల విద్య కోసం ఖర్చు చేస్తున్న రూ. 20,130కు అదనంగా ఒక్కో విద్యార్థికి కోచింగ్ కోసం సుమారు రూ. 6,380 ఖర్చు చేశాయి. అంటే, ఆ పిల్లల చదువు కోసం వారు చేసే ఖర్చులో దాదాపు నాలుగో వంతు కోచింగ్‌కే వెచ్చిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో అయితే, ఇది సుమారు పదో వంతు ఉంటుంది.ఇటీవల నిటి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘‘భారతదేశ యువత దేశానికి గొప్ప ఆస్తి అని, వారిని జనాభా లాభం నుంచి అభివృద్ధి లాభంగా మార్చాలి’’ అని అన్నారు. ‘‘ భవిష్యత్ అవకాశాలు, సవాళ్లకు యువతను సిద్ధం చేయడానికి విద్య, నైపుణ్యాభివృద్ధి , సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని’’ ఆయన రాష్ట్రాలను కోరారు. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలను మాత్రం భర్తీ చేయటం లేదు. ప్రభుత్వరంగంలోని వాటాలను హోల్ సేల్ గా ప్రయివేటుకు కట్టబెట్టడంపై చూపుతున్న శ్రద్ధ యువత ఉపాధి పై చూపితే బాగుంటుందని జెన్ జీ డిమాండ్ చేసింది.​

కొంచెం వయస్సు పైబడిన పట్టభద్రుల విషయంలో పరిస్థితి మరింత దిగజారింది. 25-29 ఏండ్ల వయస్సు గల వారిలో నిరుద్యోగం 1983లో 12.2 శాతం నుంచి 2023 నాటికి దాదాపు రెట్టింపు (20 శాతం) అయ్యింది. గతంతో పోలిస్తే ఇప్పుడు పట్టభద్రులు ఉద్యోగం కోసం వేచి ఉండే కాలం వారి 20 ఏండ్ల వయస్సు చివరి దశ వరకు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -