Wednesday, May 27, 2026
E-PAPER
Homeఆటలుసింధు శుభారంభం

సింధు శుభారంభం

- Advertisement -

సాత్విక్‌ జోడీ సైతం ముందంజ
సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750

​సింగపూర్‌ : భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు సింగపూర్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఈ సీజన్లో తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న సింధు సూపర్‌ 750 టోర్నమెంట్‌లో తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ సైతం ముందంజ వేసింది. సింధు, సాత్విక్‌ జోడీ శుభారంభంతో సింగపూర్‌ ఓపెన్‌ను భారత షట్లర్లు టైటిల్‌ వేటను ఆశావహ దృక్పథంతో షురూ చేశారు. మహిళల సింగిల్స్‌లో ఇండోనేషియా షట్లర్‌ పుత్రి కుసుమ వర్దనిపై 21-17, 21-18తో వరుస గేముల్లో సింధు చిత్తు చేసింది. ఆరంభంలో నాలుగు పాయింట్ల ముందంజలో నిలిచిన సింధు.. తర్వాత లయ తప్పినా కీలక సమయంలో పుంజుకుంది. 16-16తో స్కోరు సమం చేసి వరుసగా ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ హోరాహోరాగా సాగింది. ప్రతి పాయింట్‌ కోసం సింధు, వర్దని నువ్వా నేనా అన్నట్టు పోరాడారు. విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన సింధు.. అదే జోరు కొనసాగించింది. వరుస గేముల్లో ఇండోనేషియా అమ్మాయిని చిత్తు చేసి ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో వరల్డ్‌ నం.4 సాత్విక్‌, చిరాగ్‌ జోడీ 26-28, 21-15, 21-13తో చైనీస్‌ తైపీ షట్లర్లు చెన్‌ జి, స్మిత్‌లపై ఉత్కంఠభరిత మూడు గేముల మ్యాచ్‌లో విజయం సాధించారు. 75 నిమిషాల హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తొలి గేమ్‌ సూపర్‌ ట్రేబేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో తొలి గేమ్‌ను 26-28తో చేజార్చుకున్న సాత్విక్‌, చిరాగ్‌లు గొప్పగా పుంజుకున్నారు. తర్వాత వరుస గేముల్లో చైనీస్‌ తైపీ షట్లర్లను మట్టికరిపించారు. స్పష్టమైన తేడాతో రెండు గేమ్‌లను గెల్చుకున్న సాత్విక్‌, చిరాగ్‌లు పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టి నిరాశపరిచాడు. విక్టర్‌ చేతిలో 21-11, 14-21, 12-21తో ఓటమి చెందాడు. తొలి గేమ్‌ను గెల్చుకుని ఆధిక్యంలో నిలిచిన ఆయుష్‌ శెట్టి.. తర్వాత అంచనాలను అందుకోలేదు. ప్రత్యర్థికి పోటీ ఇవ్వటంలో తేలిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌, రుత్విక సాయి జోడీ 18-21, 20-22తో వరుస గేముల్లో పోరాడి ఓడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -