న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తహసీల్దార్ ఉత్తర్వుల రద్దుపై నిర్ణయంపెద్దషాపూర్‌లోని 170 ఎకరాల భూములపై కలెక్టర్ వివరణ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ ఉత్తర్వుల (28/02/ 2026) ను అనుసరించి భూ భారతి ఫోర్టల్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులూ చేయలేదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. తహసీల్దార్ ఉత్తర్వుల(బి/223/2025) రద్దు కోసం లీగల్ ఒపీనియన్ ప్రకారం హైకోర్టు వెకేషన్ పూర్తైన వెంటనే చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ఈ భూములపై యథాతథ స్థితి కొనసాగు తుందని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ రెవెన్యూ సర్వే నంబర్ 172 నుంచి 183 వరకు ఉన్న 170 ఎకరాల వివాదాస్పద భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ఈ భూముల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏప్రిల్ 16న స్టేటస్‌కో జారీ చేసింది. యథా స్థితి కొనసా గించాలని, ఇక్కడ ఎటువంటి అనుమతులు, మ్యూటేషన్లు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఈ భూములపై కంటెమ్ట్ కేసు జూన్ 12న విచారణకు రానుంది. నిజానికి 1954-55 సంవత్సరానికి సంబంధించిన ఖస్రా పహాణీ, 1955-58 సంవత్సరాలకు సంబంధించిన చేసాల పహాణీల ప్రకారం పెద్దషాపూర్ రెవెన్యూ పాత సర్వే నంబర్ 202కు చెందిన కొత్త సర్వే నంబర్లు 172 నుంచి 183లో ఉన్న 170 ఎకరాలను పట్టా భూములుగా నమోదు చేశాం.
రాజేంద్రనగర్ డివిజన్‌కు చెందిన ల్యాండ్ రీఫార్మ్స్ ట్రిబ్యూనల్ కమ్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఎల్‌ఆర్‌డబ్ల్యూ నంబర్ 2238, 2239, 2455/2017 ప్రక్రియ ద్వారా ఎల్‌ఆర్‌డబ్ల్యూ సీసీ నంబర్ డబ్ల్యూ/80/75, డబ్ల్యూ/92/75లో సీలింగ్ సర్‌ప్లస్‌గా ప్రకటించిన భూముల్లో భాగంగా ఉన్న సదరు సర్వే నంబర్ 174లోని 7.73 ఎకరాలు, 175లోని 11.54 ఎకరాలు, 176లోని 9.91 ఎకరాలు, 177లోని 4.63 ఎకరాలు, 178లోని 10.70 ఎకరాలు, 182లోని 10.68 ఎకరాలు, 183లోని 10.33 ఎకరాలు, 154లోని 9.45 ఎకరాలు.. మొత్తం 74.97 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, 22ఎ జాబితాలో నమోదు చేశాం. ఇదే సమయంలో నవాబ్ మొహ్మద్ యూసుపుద్దీన్‌ఖాన్, స్వర్గీయ నవాబ్ వజియోద్దీన్‌ఖాన్ కుమారుడు సహా మరో నలుగురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. సర్వే నంబర్లు 172,173,174,175,176, 177,179,180, 1802లోని 94.28 ఎకరాలు మావేనని, మా పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయకపోవడం చట్టవిరుద్ధమని వారు కోర్టులో పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకే తహసీల్దార్ ఆ మొత్తం భూమిని ఆయా వ్యక్తుల పేర్లతో రికార్డుల్లో నమోదు చేశారు’’ అని కలెక్టర్ వివరించారు. ఆ తర్వాత మిస్టర్ ఓంకార్ క్వారియర్స్ అండ్ మూవర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించి, రిట్‌పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ వివాదాస్పద భూములపై అనేక నాటకీయ పరిణామాల మధ్య హైకోర్టు ఏప్రిల్ 29న స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.
ఆ భూములపై మార్పుల్లేవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



