నల్లగొండ జిల్లా బుగ్గబావిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
13 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైనే టెంపరేచర్
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
ఉదయం 10 దాటితే బయటకు వెళ్లేందుకు జంకుతున్న జనం
మరో మూడు నాలుగు రోజులూ ఇదే పరిస్థితి
రాష్ట్రంలో అక్కడక్కడా వర్షం పడే సూచనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోహిణి కార్తె ఎండలు మాడ పగిలేలా కొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు ఇంటి నుంచి అడుగు పెట్టలేనంత స్థాయిలో భానుడు భయపెడు తున్నాడు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో 20 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయంటేనే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో13 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలున్నాయి. నల్లగొండ జిల్లా వేముల పల్లి మండలంలోని బుగ్గబావిలో అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రి అయినా వేడి మాత్రం తగ్గడం లేదు. రాత్రి 11 గంటల సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉంటున్నాయి. వచ్చే మూడునాలుగు రోజుల పాటు ఇదే స్థాయిలో ఎండలుంటాయనీ, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరించారు. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలుల వర్షం అక్కడక్కడా పడే సూచనలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు 44 ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షం పడింది.
తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్
బుగ్గబావి(నల్లగొండ) 46.5 డిగ్రీలు
ఏడూళ్ల బయ్యారం
(భద్రాద్రి కొత్తగూడెం) 46.4 డిగ్రీలు
ధర్మపురి(జగిత్యాల) 46.4 డిగ్రీలు
కుంచవల్లి(కొమ్రంభీమ్
అసిఫాబాద్) 46.4 డిగ్రీలు
మాచర్ల(నిజామాబాద్) 46.4 డిగ్రీలు
గరిడేపల్లి
(సూర్యాపేట) 46.4 డిగ్రీలు
ఏన్కూరు(ఖమ్మం) 46.3 డిగ్రీలు
జానకాపూర్
(మంచిర్యాల) 46.3 డిగ్రీలు
అక్కెనపల్లి
(పెద్దపల్లి) 46.3 డిగ్రీలు
ఇందుర్తి
(కరీంనగర్) 46.2 డిగ్రీలు



