Monday, September 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనల్లగొండలో ఎఐకెఎస్ 36వ జాతీయ మహాసభలు

నల్లగొండలో ఎఐకెఎస్ 36వ జాతీయ మహాసభలు

- Advertisement -

హైదరాబాద్‌‌లో మహాసభల ప్రచార కరపత్రాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) 36వ జాతీయ మహాసభలను నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి. సాగర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్ రోడ్ వద్ద గల తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మందికిపైగా అమరులై, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన పోరాటాల పురిటిగడ్డ నల్లగొండలో తొలిసారి ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. మహాసభల సందర్భంగా లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. దేశనలుమూలల నుండి 1,500 మంది రైతు ఉద్యమ నేతలు, ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రతినిధులుగా మహాసభలకు హాజరవుతారని చెప్పారు. జాతీయ మహాసభలకు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రైతు సమస్యలపై చర్చలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపకల్పన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, సెమినార్లు ఉంటాయని తెలిపారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయడం, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ, విద్యుత్ ప్రయివేటీకరణ నుంచి కాపాడటం, ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాకు కీలకమైన ఎస్‌ఎల్‌‌బీసీ సొరంగం పనులను త్వరగా పూర్తి చేసి డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

మూసీ ప్రాజెక్ట్ ఆధునీకరణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, బీడు, పోడు భూములకు పట్టాలు, రుణమాఫీ పూర్తిస్థాయి అమలు, రైతు భరోసా నిధుల విడుదల, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం. రైతాంగ సమస్యల పరిష్కారం పోరాటాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూఢ్‌ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్శింహ్మరెడ్డి, పి. జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, మాదినేని రమేష్, కందాల ప్రమీల, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, శెట్టి వెంకన్న, యం శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు అన్నవరపు సత్యనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాటూరి బాలరాజు గౌడ్, పల్లపు వెంకటేష్, కొక్కెరపాటి పుల్లయ్య, భూక్య చందూనాయక్, కొంగరి వెంకట్ మావో, దుబ్బాక రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -