Wednesday, May 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైకోర్టు ఆదేశించినా అందని ఇంక్రిమెంట్లు

హైకోర్టు ఆదేశించినా అందని ఇంక్రిమెంట్లు

- Advertisement -

జూనియర్ లెక్చరర్ల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్యంమూడేండ్లు గడిచినా అందని బకాయిలు3,100 మంది అధ్యాపకుల ఆవేదన..ప్రభుత్వానికి వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పట్ల ప్రభుత్వం, విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. క్రమబద్ధీకరణ జరిగి మూడేండ్లు గడుస్తున్నా, వారికి రావాల్సిన వార్షిక ఇంక్రిమెంట్ల విషయంలో అధికారులు కాలయాపన చేస్తున్నారు. హైకోర్టు స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, నేటికీ రెండో గ్రేడ్ వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించకపోవడంపై అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ విద్యాశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేకుండాపోయింది. కోర్టు ఆదేశాల బేఖాతరురాష్ట్రవ్యాప్తంగా 423 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 3,100 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను 2023, మే 4న(జీవో నెం. 16 ప్రకారం) ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వీరికి 2024 మే నెలలో మొదటి వార్షిక ఇంక్రిమెంట్ లభించింది. 2025 మే నెలలో అందాల్సిన రెండో వార్షిక ఇంక్రిమెంట్‌ను పలు కళాశాలల ప్రిన్సిపాల్స్ నిలిపివేశారు. దీనిపై అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించగా, రెండో ఇంక్రిమెంట్ వెంటనే చెల్లించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చి రోజులు గడుస్తున్నా, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందనా లేదు.పెండింగ్‌లో మూడో ఇంక్రిమెంట్..ఈ బ్యాచ్ అధ్యాపకులు 2026 మే నెలతో మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. దీంతో వీరికి మూడో వార్షిక ఇంక్రిమెంట్ కూడా అందాల్సి ఉంది. రెండో ఇంక్రిమెంట్ బకాయిలు రాక, మూడో ఇంక్రిమెంట్ ఊసే లేక లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. మెడికల్ సెలవులు మంజూరు చేయడంలోనూ సంబంధిత అధికారులు ఇబ్బందు లకు గురి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సీనియారిటీ జాబితా ఎక్కడ?సర్వీసు పూర్తి చేసుకున్నా అడ్మినిస్ట్రేషన్ జాప్యం వల్ల ప్రొబేషనరీ డిక్లరేషన్, రెగ్యులరైజేషన్ ప్రక్రియలు పూర్తి కాలేదు. దీనివల్ల సీనియారిటీ జాబితా తయారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దురదృష్టవశాత్తు కొంతమంది అధ్యాపకులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. వాళ్లకు సంబంధించి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ అధ్యాపకులతోపాటే పాలిటెక్నిక్, డిగ్రీ,హెల్త్ డిపార్టుమెంట్‌, ఇరిగేషన్, రెవెన్యూ డిపార్టుమెంట్‌లలో సుమారుగా 11,000 మంది రెగ్యులర్ సర్వీసులోకి మారారు. ఇతర డిపార్టుమెంట్‌ వారికి లేని నిబంధనలు తమకే ఎందుకు? అని తెలంగాణ గవర్నమెంట్ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 అసోసియేషన్ నేతలు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కె. సురేష్, కేపీ శోభన్ బాబు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -