తక్షణమే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
నీరుకుళ్ల సొసైటీ కొనుగోలు కేంద్రం సందర్శన
నవతెలంగాణ – ఆత్మకూరు
రైతులు అప్పులు తెచ్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విమర్శించారు. ‘రైతు గోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రైతులతో మాట్లాడారు. 15 రోజులుగా కల్లాల్లో వడ్లు ఆరబోసుకుని పడిగాపులు కాస్తున్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తేమ శాతం, లారీలు లేవనే సాకులు చెప్పి కొనడం లేదని, అకాల వర్షాలకు పంట కండ్ల ముందే తడిసి మొలకెత్తు తోందని తెలిపారు. దాంతో ఎంపీలు పెంచికలపేట సొసైటీ కార్యదర్శి ఓదెల లక్ష్మయ్యను పిలిపించారు. వారాల తరబడి ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదు? రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే కొనుగోళ్లు మొదలుపెట్టాలని, లేకపోతే బీజేపీ రైతుల పక్షాన ఉండి ఉద్యమిస్తుందని చెప్పారు. అనంతరం విలేకరులతో ఎంపీలు మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. యాసంగిలో ఎంత ధాన్యం దిగుబడి వస్తుందో కనీస అంచనా వేయకుండా కొనుగోలు కేంద్రాలు తెరిచామంటూ మంత్రులు డ్రామాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.



