పరిశీలన పేరుతో వృద్ధురాలిని అడవిలో వదిలేసిన వైనం
చైన్ స్నాచింగ్‌పై ఫిర్యాదు చేస్తే తీసుకోని ఎస్‌ఐ
అసలు దొంగతనమే జరగలేదని వాదన
ఝరాసంఘం పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా
విచారించిన డీఎస్పీ సైదా నాయక్
నవతెలంగాణ-ఝరాసంగం, మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం ఎస్‌ఐ పాటిల్ క్రాంతికుమార్ వివాదంలో చిక్కుకున్నారు. పొలానికి వెళ్తుండగా దుండగులు తన మెడలోంచి కాళ్ల కడియాలు, మెడలోని బంగారం గుండ్ల చైన్ లాక్కేల్లారని ఫిర్యాదు చేసేందుకు వృద్ధురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్తే.. ఫిర్యాదు తీసుకోకపోగా.. అసలు దొంగతనమే జరగలేదంటూ ఎస్‌ఐ పాటిల్ క్రాంతికుమార్ వాదించారు. పైగా దొంగతనం ఎక్కడ జరిగిందో చూపించాలంటూ వృద్ధురాలిని పోలీసు వాహనంలో తీసుకెళ్లి ఘటన స్థలానికి సమీపంలోని అడవిలో వదిలేసి వచ్చారు. విషయం తెలిసిన గ్రామస్తులు వృద్ధురాలితో కలిసి మంగళవారం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామానికిి చెందిన ఇద్దరు మహిళలు పొలం పనికి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు నర్సమ్మ అనే వృద్ధురాలిని బెదిరించి మెడలోని తులం బంగారు గుండ్లు, కాళ్ల వెండి కడియాలను లాక్కెళ్లారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఝరాసంగం పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. ”సార్ న్యాయం చేయండి” అని బతిమిలాడితే.. ఎక్కడ దొంగతనం జరిగిందో చూపించాలంటూ వృద్ధురాలు నర్సమ్మను ఎస్‌ఐ అడవిలోకి తీసుకెళ్లారు.
అక్కడ దొంగతనం జరిగిందడానికి ఎలాంటి ఆనవాళ్లూ లేవని, దొంగలు నగలు లాక్కెళ్తే గాయాలవుతాయి కదా? ఆమెకు ఎక్కడా గాయాలు లేదంటూ వృద్ధురాలిని అడవిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అసలే దొంగతనం జరిగిందనే బాధలో ఉంటే ఎస్‌ఐ తీరు అవమానకరంగా ఉండటం, ఒంటరిగా మహిళను అడవిలో విడిచి రావడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలితో కలిసి పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై పెద్దఎత్తున ధర్నా చేశారు. వృద్ధురాలు ఫిర్యాదు చేస్తే తీసుకోరా? దొంగలకు సపోర్ట్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ధర్నా విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ సైదానాయక్ గ్రామానికొచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు డీఎస్పీకి వివరించారు. ఎస్‌ఐ తీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని గ్రామస్తులకు డీఎస్పీ హామీ ఇచ్చారు. మండల పరిధిలో నీమ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఇతర ప్రాంతాల వారు, బీహార్ రాష్ట్ర కూలీలు పనులు చేస్తున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వలస కూలీలపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిపై నిఘా ఉంచాల్సిన పోలీసులు ఫిర్యాదు దారులపట్ల అవమానకరంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
పోలీసులా..మజాకా…!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



