జిల్లాల వారీగా సమగ్ర కార్యాచరణ
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు
నవతెలంగాణ-మహదేవపూర్
వచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సమాయత్తం అవుతోందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు మంగళవారం ఆయన వచ్చారు. అనంతరం భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లతో మెగా విశ్రాంతి భవనంలో సమావేశం నిర్వహించారు. సరస్వతి ఆది, అంత్య పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లు, సౌకర్యాలను పీపీటీ ద్వారా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎదురైన లోటుపాట్లను గుర్తించి, గోదావరి పుష్కరాల్లో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందుకోసం గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లాల కలెక్టర్లతో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు. పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ సరఫరా, వీఐపీ పర్యటనలకు ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల కలెక్టర్లు బొర్కడే హేమంత్ సహదేవరావు, కుమార్ దీపక్, కుమార్ దీపక్, సత్య ప్రసాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల అదనపు కలెక్టర్లు బుజంగరావు, వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం ఆర్డీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



