Wednesday, May 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిజయన్‌ ఇంట్లో ఈడీ సోదాలు రాజకీయ దాడే

విజయన్‌ ఇంట్లో ఈడీ సోదాలు రాజకీయ దాడే

- Advertisement -

– కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
– ప్రశ్నించే వ్యక్తులే టార్గెట్‌‌గా దాడులు
– ప్రజల్ని సమీకరించి రాజకీయ, న్యాయ పోరాటం చేస్తాం
– అన్ని రంగాల్లోనూ మోడీ సర్కారు వైఫల్యం
– సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌
– ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తికాగానే ప్రతిపక్ష‍ాలపై దాడి
– కాక్రోచ్‌ జనతా పార్టీ వెబ్‌‌సైట్‌, ఎక్స్‌ ఖాతాలను నిషేధించడం దారుణం
నవతెలంగాణ – హైదరాబాద్ :
సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు కేరళం మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌ ఇంట్లో ఈడీ సోదాలు బీజేపీ చేయిస్తున్న రాజకీయ దాడేనని సీపీఐ(ఎం) పొలిట్‌‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌ ‌విమర్శించారు. ప్రశ్నించే వ్యక్తులే టార్గెట్‌‌గా దాడులు చేయిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టారు. బుధవారం హైదరాబాద్‌‌లోని ఎంబీభవన్‌(‌సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం)లో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆయనతో పాటు ఆ పార్టీ పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయరాఘవన్‌ ‌మాట్లాడుతూ..ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సీపీఐ(ఎం) నేతలపై ఒక్క కేసు కూడా లేదని నొక్కి చెప్పారు. సీపీఐ(ఎం) విలువలతో కూడిన నీతివంతమైన పార్టీ అన్నారు. కార్పొరేట్‌ ‌సంస్థల నుంచి ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికల బ్రాండ్లు సేకరించలేదన్నారు. కేరళంలోని ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోని మంత్రులపై ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కేసులున్నాయని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీపీఐ(ఎం) నేతలను టార్గెట్‌ ‌చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాజకీయ దాడి చేయిస్తున్నదని విమర్శించారు. ఈ విషయంపై ప్రజలను సమీకరించి రాజకీయ, న్యాయ పోరాటాలు చేయనున్నట్టు ప్రకటించారు. విజయన్‌‌పై ఈడీ దాడులను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారన్నారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ గాడితప్పిందని విమర్శించారు. రూపాయి విలువ 12 శాతం మేర పడిపోయిందన్నారు.

ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలతో ప్రజలపై తీవ్రభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో దీన్ని అడ్డుపెట్టుకుని ఆయిల్‌ ‌కంపెనీలు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్న తీరును వివరించారు. ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ ‌యుద్ధం జరుగుతున్న తరుణంలో ఆయిల్‌ ‌నిల్వలను తగిన ఉంచుకోవడంలో కేంద్రం విఫలమైందన్నారు. దేశ రాజధానిలో కూడా మల్టీనేషనల్‌ ‌కంపెనీల్లో కనీస వేతనాలు అమలు కావడం లేదని ఎత్తిచూపారు. రూ.10 వేలు, రూ.12 వేల జీతంతో ఎలా బతకాలో పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. నరేగా చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తున్న క్రమాన్ని, రాష్ట్రాలపై మోపుతున్న భారాల గురించి వివరించారు. పనిదినాల సంఖ్యను పెంచుతామని కేంద్రం చెబుతుండగా..క్ష‍ేత్రస్థాయిలో ఉపాధి కూలీల పేర్లు పెద్ద ఎత్తున తొలగించబడుతున్నాయని విడమర్చి చెప్పారు. సీపీఐ(ఎం) టార్గెట్‌‌గా బీజేపీ చేస్తున్న దాడులను తిప్పికొడతామనీ, పేదల పక్ష‍ాన ముందుండి పోరాడుతామని ప్రకటించారు. బీవీ.రాఘవులు మాట్లాడుతూ…ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష‍ాలపై మోడీ సర్కారు దాడులను తీవ్రం చేసిందని విమర్శించారు.

తమిళనాడులో గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని విజయ్‌ ‌సర్కారు ప్రమాణ స్వీకారం చేయకుండా శతవిధాలుగా అడ్డుకున్నతీరును ఎండగట్టారు. కాక్రోచ్‌ ‌జనతాపార్టీ వెబ్‌‌సైట్‌‌ను, ఎక్స్‌ ‌ఖాతాలను మూసేయించడాన్ని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై నేరుగా దాడులు జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష‍ాలను, ప్రశ్నించే మీడియాను సమహించలేని స్థితిలో బీజేపీ ఉందని విమర్శించారు. ప్రజాస్వామిక, లౌకిక, విశాల దృక్పథం ఉన్న శక్తులను కలుపుకుని పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఇరాన్‌‌పై ఇజ్రాయిల్‌, అమెరికా చేస్తున్న దాడులను మోడీ సర్కారు సమర్ధించడాన్ని తప్పుబట్టారు. ట్రంప్‌‌ సర్కారుకు దాసోహమై అలీన విధానాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు. ఫలితంగా నేడు ఇండియా జీడీపీ 1.15 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రష్యా, ఇరాన్‌ ‌నుంచి తక్కువ ధరలో చమురు వచ్చే అవకాశమున్నా అమెరికా ఒత్తిడితో అమెరికా, వెనిజులా నుంచి ఆయిల్‌‌ను కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. సామ్రాజ్య వాద విస్తరణ కాంక్ష‍తో క్యూబా అధ్యక్ష‍ులు రౌల్‌ ‌కాస్ర్టోపై యూఎస్‌‌లోని ప్లోరిడా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష‍ విధించేలా చేసి అతన్ని మధురో మాదిరిగా కిడ్నాప్‌ ‌చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు.

విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి : జాన్‌‌వెస్లీ
విద్యా, వైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని అందరికీ ఉచిత విద్య, వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో జరుగుతున్న దోపిడీని ఎండగట్టారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, టీచింగ్‌, నాన్‌‌టీచింగ్‌ ‌పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర ఆవిర్భావదినోత్సం సందర్భంగా జూన్‌ ‌రెండో తేదీన నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌‌పై ఏపీలో నమోదైన కేసులను ఉపసంహరించుకునేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నాగేశ్వర్‌‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం పోరాటాలు చేస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -