Thursday, May 28, 2026
E-PAPER
Homeఆటలుక్వాలిఫయర్-2కి చేరిన రాజస్థాన్ రాయల్స్

క్వాలిఫయర్-2కి చేరిన రాజస్థాన్ రాయల్స్

- Advertisement -

టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
భారీ లక్ష్య ఛేదనలో తడబడిన హైదరాబాద్
చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
29 బంతుల్లో 97 పరుగులు
నవతెలంగాణ – హైదరాబాద్‌: 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. బుధవారం చండీగఢ్‌లో జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు, ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన తోడవడంతో సన్‌రైజర్స్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి పెను విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. అతని దూకుడుతో రాజస్థాన్ 8 ఓవర్లకే 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 50) కూడా మెరుపు అర్ధశతకంతో రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పవర్‌ప్లేలోనే తన పదును చూపించాడు. అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (17), ఇషాన్ కిషన్ (33) వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న హెన్రిచ్ క్లాసెన్ (18) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రెడ్డి (38), సలీల్ అరోరా (35) కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19.2 ఓవర్లలో 196 పరుగుల వద్ద ముగిసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2 మ్యాచ్ కు అర్హత సాధించింది. ఈ నెల 29న జరిగే క్వాలిఫయర్-2 పోరులో రాజస్థాన్… గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -