పట్టణాల్లో లక్ష ఇండ్లు కడతాం
భూముల విలువ కంటే పేదల
ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం :
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్‌లో శిథిలావస్థ భవనాలు,
ఖాళీ స్థలాల పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో/చార్మినార్
నగరం వెలుపల కాకుండా కోర్ అర్బన్ ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టి పేదలకు అందజేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఆసిఫ్ నగర్, నాంపల్లి, మలక్‌పేట, గోల్కొండ మండలాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యేలు మాజిద్ హుస్సేన్, అహమ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాతో కలిసి శిథిలావస్థలో ఉన్న భవనాలను, ప్రభుత్వ ఖాళీ భూములను మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి ముహూర్తం ఖరారైందని వెల్లడించారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, పట్టణ పేదల కోసం తొలి విడతలో లక్ష ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
పేదల జీవనోపాధికి భద్రత
పదేండ్ల పాలనలో పేదల ఇండ్ల నిర్మాణాన్ని నగరం వెలుపల చేపట్టడం వల్ల వారు ఉపాధి కోల్పోయారని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ తప్పు జరగనివ్వదని, భూమి విలువ కంటే పేదల ఆత్మగౌరవమే ముఖ్యమని భావిస్తోందన్నారు. అందుకే నగరంలోని ‘కోర్ అర్బన్’ ప్రాంతాల్లోనే ప్రభుత్వ భూములను గుర్తించి, అక్కడే బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి పేదలకు అందజేస్తామన్నారు. నిరుపేదల జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో, నివాసయోగ్యమైన స్థలాల్లో ఇండ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
శిథిల భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలు
జియాగూడలోని పోలీస్ క్వార్టర్స్, మంగార్ బస్తీలోని వాంబే కాలనీ, రెడ్ హిల్స్‌లోని ఖాళీ స్థలాలు, మలక్‌పేట కాలడేరాలోని ఆర్ అండ్ బి కాలనీ, ఫలక్‌నుమా 2బీహెచ్‌కే డిగ్నిటీ కాలనీ ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. ఈ పర్యటనలో శిథిలావస్థ భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలతో మంత్రి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.



