పోరాట కేతనం రైతు సంఘం

పోరాట కేతనం రైతు సంఘం– ఉద్యమాల ఫలితంగానే ఆత్మహత్యలను గుర్తించిన సర్కారు
– అన్నదాత మరణిస్తే ఐదు లక్షలు
– కొత్త భూసేకరణ చట్టం వెనక్కి…
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అన్నదాతలకు రైతు సంఘమే అండదండ. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనూ దారి తప్పిన సర్కారును పోరాటాలతో దారికి తెచ్చింది రైతు పోరాటమే. ప్రత్యేక రాష్ట్రంలోనూ రైతన్నల ఆత్మహత్యలు ఆగలేదు. రైతు ఆత్మహత్యలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హేళన చేస్తూ మాట్లాడింది. రైతులు తాగి చనిపోతున్నారు. భార్యాభర్తలు కొట్లాడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. కనీసం రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి సిద్ధపడలేదు. ఈ నేపథ్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఆయా జిల్లాల్లో రైతులను పెద్ద ఎత్తున సమీకరించి రోడ్డమీదికి వచ్చింది. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమంటూ నిలదీసింది.ఆ ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీవరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో ఒకొక్క మెట్టు దిగి వచ్చింది. దీంతోపాటు రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇస్తున్నది. రైతు బంధు పథకం తెచ్చినప్పటికీ రైతు ఆత్మహత్యలను గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. ఎలాంటి మరణం సంభవించినా రూ 5 లక్షల బీమా ఇస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యల నివారణకు సరైన ప్రణాళికలు రచించడం లేదు. అది అన్నదాతను అన్ని విధాల ఆదుకోలేకపోతున్నదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీతో కూడిన ఉపకరణాలు ఇవ్వడంలేదు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు నిలిపేసింది. ఈ చెయ్యి తో ఇచ్చిన ఆ చెయ్యితో గుంజుకున్నట్టు రైతు బంధు జమ చేస్తూనే….సబ్సిడీ మార్గాలను మూసేసింది. దీంతో రైతు కష్టాలు యాడేసిన గొంగడి ఆడనే అన్నట్టు తయారైంది. ఇప్పటికీ కౌలు రైతులను గుర్తించడం లేదు. రైతు ఆత్మహత్యల్లో అత్యధికంగా కౌలు రైతులవే. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతుల చట్టం 2011ను అమలు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఆ చట్టం ప్రకారం కౌలు రైతులకు రుణార్హత కార్డు ఇవ్వడం ద్వారా బ్యాంకుల్లో రుణాలు అందుతాయి. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందుతాయి. కానీ ప్రభుత్వం వారికి గుర్తించకుండా మొండికేస్తున్నది. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలంటూ రైతు సంఘంతోపాటు ఇతర ప్రజాసంఘాలతో కలిసి దశలవారీగా పోరాటాలు నిర్వహించింది. ఈ క్రమంలో ప్రభుత్వం రైతు నాయకులపై కేసులు, పీడీయాక్టులు మోపింది. జైళ్లకు పంపించింది. అయినా మొక్కవోని ధైర్యంతో నిరంతరం పోరాటాలు నిర్వహించింది రైతు సంఘం. ఈ ఫోరాట ఫలితంగా 4.2 లక్షల మంది రైతులకు సర్కారు పోడు పట్టాలను పంపిణీ చేసింది. మరో ఏడున్నర లక్షల మంది రైతులకు పట్టాలు అందాల్సి ఉన్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనేందుకు సర్కారు వెనుకడుగేసింది. కొనుగోలు కేంద్రాలు పెంచాలంటూ రైతు సంఘం వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి విజయం సాధించింది. ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు, ప్రభుత్వం భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణకు శ్రీకారం చుట్టింది. కానీ భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల బాధలు పట్టించుకోలేదు. వారికి భూసేకరణ చట్టం -2013 అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. పరిహారం కూడా తక్కువగా వచ్చే విధంగా ఉన్నది. దీనిపై రైతు సంఘం సమరశీల పోరాటం నిర్వహించింది. ముఖ్యంగా మల్లన్న సాగర్‌, కొండ పోచమ్మ రిజర్వాయర్ల కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు అండగా నిలబడింది. ఆ పోరాటం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఉధృతమై సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరికి ప్రభుత్వం రైతులపై కాల్పులకు తెగబడింది.అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో దిగొచ్చిన సర్కారు భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇస్తామని ఒప్పుకుంది. అధిక వర్షాలు, అకాల వర్షాలు, కరువు పరిస్థితులకు ప్రతియేటా పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అడవి పందులు, కోతులు, నెమళ్ల కూడా పంటలను నాశనం చేస్తున్నాయి. తూ తూ మంత్రంగా పంట నష్టం లెక్కలేసి పరిహారం సరిగా ఇవ్వడం లేదు. ఇప్పటికే 5 నుంచి 8 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీనిపై రైతు సంఘం అనేక పోరాటాలు నిర్వహించింది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. పంట బీమా, రైతుకు భరోసా లేదని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ తెలిపారు.

Spread the love