ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ల్లోనూ డిజిటల్‌ ఇండియా నెంబర్‌ వన్‌ !

ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ల్లోనూ డిజిటల్‌ ఇండియా నెంబర్‌ వన్‌ !– నిషేధాలతో లక్షలాదిమందికి ఇబ్బందులు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్‌ ఐడి డేటాబేస్‌తో, రోజువారీ లావాదేవీలకు విస్తృత డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ కలిగిన, రోదసీ, ఉపగ్రహ కార్యకలాపాల్లో పేరెన్నికగన్న భారత్‌కు అనుసంథానంతో కూడిన సాంకేతికత శక్తి గురించి బాగా తెలుసు. కానీ, ఎక్కడైనా రాజకీయ అశాంతి లేదా వర్గ హింస చోటు చేసుకుంటే చాలు వెంటనే అధికారులు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించే పేరుతో ఇంటర్‌నెట్‌ సేవలను కట్‌ చేస్తారు. కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌, బిజినెస్‌ల కోసం వెబ్‌పై ఆధారపడే లక్షలాదిమంది ప్రజలు దీంతో ఇబ్బందుల్లో పడతారు. అధికారులకు సంబంధించినంతవరకు ఇంటర్‌నెట్‌ నిషేధమన్నది వారి మొదటి సాధనంగా వుంటుందని భారత్‌లో ఆన్‌లైన్‌ పౌర హక్కుల కార్యకర్త మిషి చౌదరి వ్యాఖ్యానించారు. ఇలా ఇంటర్నెట్‌పై విధించే నిషేధం గంటలు, రోజులు, కొన్నిసార్లు నెలల తరబడి కూడా కొనసాగుతుంది.
మణిపూర్‌లో ఘర్షణలు తలెత్తిన మే మాసం నుండి 30లక్షలమందికి పైగా ప్రజలకు మొబైల్‌ ఇంటర్‌నెట్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ కారణంగా హింసాకాండ సందర్భంగా ఆచూకీ తెలియకుండా పోయిన తన కొడుకు గురించి తెలుసుకోవడానికి ఆ తల్లికి రెండు మాసాలు పట్టింది. సెప్టెంబరులో నెట్‌ను కొద్దిసేపు పునరుద్ధరించినపుడు ఒక యువకుని శవం ఫోటోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అప్పుడు మాత్రమే తన కుమారుడి శవాన్నైనా చూడగలిగానని ఆ తల్లి వాపోయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ల్లో కూడా అంతర్జాతీయంగా అగ్రగామిగా వుందని న్యూయార్క్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆన్‌లైన్‌ ఫ్రీడమ్‌ మోనిటర్స్‌ యాక్సెస్‌ నౌ పేర్కొంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 187సార్లు ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌లు నమోదవగా, అందులో 84 భారత్‌లోనే చోటు చేసుకున్నాయి. వరుసగా ఐదేళ్ళ నుండీ భారత్‌ ఈ విషయంలో టాప్‌లో వుందని పేర్కొంది. నిరసనలు, పరీక్షల సమయంలో మోసాలను నివారించడానికి ఇలా నెట్‌ను నిషేధించడం ప్రధాన కారణాలుగా వున్నాయని ఒక విశ్లేషణలో తేలింది. 2020 నుండి 2022 వరకు ఇంటర్‌నెట్‌ నిషేధాలపై ఇంటర్‌నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ జరిపిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రతికూల వాణి వినిపించకుండా వుండేందుకు ప్రభుత్వం దీన్ని ఒక ఎత్తుగడగా అమలు చేస్తున్నా, ఇది కలగచేసే ప్రభావం ఎలా వుంటుందో అధికారులు అర్ధం చేసుకోలేకపోతున్నారని సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడమ్‌ లా సెంటర్‌ వ్యవస్థాపకురాలైన మిషి చౌదరి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఆన్‌లైన్‌ సోషల్‌ సపోర్ట్‌ వ్యవస్థలపై ఆధారపడే నిరుపేదలు దీనివల్ల తీవ్రంగా ఇబ్బందుల పాలవుతారని మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థ విమర్శించింది. మొత్తంగా గతేడాది ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ల వల్ల దాదాపు 12.1కోట్ల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని తెలిపింది.
ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఆన్‌లైన్‌ఫై ఆధారపడే వాణిజ్య కార్యకలాపాలన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అలాగే జర్నలిస్టులు కూడా తమ విధి నిర్వహణలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇంటర్‌నెట్‌ను నిషేధించడం వల్ల విద్వేష ప్రచారం కాస్తంత నెమ్మదిస్తుందేమో కానీ సమస్యలు, ఘర్షణలకు మూల కారణాలు పరిష్కారం కావని అన్నారు.

Spread the love