Sunday, May 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంతా దోపిడీ…!

అంతా దోపిడీ…!

- Advertisement -

బాటసింగారం మార్కెట్లో దళారులదే ‌రాజ్యం
సిండికేట్‌ వ్యవస్థలో నలిగిపోతున్న రైతులు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూటికి రూ.4 కమీషన్‌
వసూళ్లు మాత్రం రూ. 12
తరుగు పేరుతో క్వింటాలుకు 20 కిలోలు కోత
ప్రతియేటా మామిడి విక్రయాల విలువ రూ.300 కోట్లు
12 శాతం దళారుల చేతుల్లోకి..
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మార్కెట్‌ అధికారులు

నవతెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మామిడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఏడాది కాలం పాటు కంటికి రెప్పలా పంటను కాపాడుకుని, మార్కెట్‌కు తీసుకొస్తే… నచ్చిన ధరకు అమ్ముకోవడానికి వీలు లేని పరిస్థితి ఉంది. రైతు తన పంటను దళారీ చేతిలో పెట్టాలి. దళారీ ఎంత చెప్పితే అంతే. ఆసియాలోనే నెంబర్ వన్‌ ఫ్రూట్‌ ‌మార్కెట్‌‌గా పేరొందిన బాటసింగారం మార్కెట్‌లో నెంబర్‌వన్ దోపిడీ జరుగు తున్నది. ఈ దోపిడీ వ్యవస్థలో రైతులు నలిగి పోతున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. కమీషన్ వసూళ్లు చేస్తూ రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. ఏజెన్సీల చేతిలో దోపిడీకి గురువుతున్న మామిడి రైతులపై కథనం. రంగారెడ్డి జిల్లాలోని అబ్దులాపూర్‌‌మెంట్‌ ‌పరిధిలో బాటసింగారం లాజిస్టిక్‌ ‌పార్కులో నడుస్తున్న ఫ్రూట్‌ ‌మార్కెట్‌ ‌ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌‌గా ప్రఖ్యాతి గాంచింది. ఈ మార్కెట్‌‌కు ప్రతి యేటా తెలంగాణ ప్రాంత రైతులు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి కూడా రైతులు మామిడి పంటను తీసుకుని వస్తుంటారు. ప్రతియేటా మార్కెట్‌‌లో సుమారు రూ.300 కోట్ల విలువ గల మామిడి క్రయ విక్రయాలు జరుగుతాయి.

రైతుల పంటను అమ్మిపెట్టేందుకు ప్రభుత్వ అనుమతి కలిగిన ఏజెన్సీలు ఉంటాయి. మార్కెట్‌‌లో ఈ ఏజెన్సీలదే రాజ్యం. రైతు ఏజెన్సీలకు నూటికి రూ. 4 చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.1 మార్కెట్‌‌కు వెళ్తుంది. కానీ నూటికి రూ. 12 ఏజెన్సీలు ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నాయి. ఈ లెక్కన దళారీలకు కేవలం ఈ సీజనే రూ.30 నుంచి 40 కోట్ల ఆదాయం వస్తోంది. ‘15 ఎకరాల మామిడి తోట సాగు చేస్తున్నాను. మామిడి పూత నుంచి కోత దాక ఎకరాకు రూ. 20 నుంచి 30 వేల పెట్టుబడి వచ్చింది. దిగుబడి మాత్రం ఆశించినంత రాలేదు. ఎకరం 6 నుంచి 7 క్వింటాలు కంటే ఎక్కువ దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పండిన పంటను మార్కెట్‌ ‌మంచి ధరకు అమ్ముదామంటే. నా పంటకు నేను ధర చెప్పే పరిస్థితి లేదు. అమ్మిన వచ్చిన దానిలో సగం కమీషన్లు పోతే పంట పెట్టుబడికి చేసిన అప్పులు ఎట్లా తీర్చాలే.. దిక్కుతోచడం లేదు ’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన మామిడి రైతు బుచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

​సిండికేట్‌ ‌వ్యవస్థలో మగ్గిపోతున్న రైతు
ఏజెన్సీలు, పంట కొనుగోలు చేసే వ్యక్తులు సిండికేట్‌ అవుతూ… పంట ఎంత మంచిగా ఉన్నా తాము అనుకున్న ధరకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌‌లో రైతు నోరు తెరిచే పరిస్థితి లేదు. ఇక్కడ అంతా ఏజెన్సీల వ్యవస్థలో రైతులు బలిపశువులుగా మారుతున్నారు. ఏజేన్సీ మాట వినకుండా ఇక్కడ పంటను విక్రయించే పరిస్థితి లేదు. మార్కెట్‌ ‌వ్యవస్థను మొత్తం ఏజెన్సీలు తమ గుప్పట్లో పెట్టుకున్నారు. మామిడి ధర బహిరంగ మార్కెట్‌‌లో కిలో ధర రూ.100 అమ్ముతుంటే.. మార్కెట్‌‌లో రైతు పంట పలుకుతున్న ధర మాత్రం రూ.30 నుంచి 40 కూడా పలుకడం లేదు. ఇందులో 12శాతం కమీషన్‌ , తరుగు తీస్తే కిలో రూ.25 కూడా దక్కని దీనమైన స్థితిలో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు ఎగుమతి
బాటసింగారం పండ్ల మార్కెట్‌కు 2004లో మార్కెట్‌కు 1,11,107 టన్నుల మామిడి రాగా వీటి ద్వారా రూ.2.70 కోట్ల ఆదాయం సమకూరింది. అదే విధంగా 2025లో 1,43, 979 టన్నులు రాగా, వీటి ద్వారా రూ.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 90 వేల టన్నుల మామిడి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో 25 నుంచి 30 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరిలో 15 నుంచి 20 మంది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. మార్కెట్‌కు వచ్చిన పంటలో 70 శాతం మామిడిని ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. కేవలం 30 శాతం పంట మాత్రమే స్థానిక అవసరాలకు వినియోగం అవుతుంది.

మార్కెట్‌‌కు పంట తెస్తే ఏమీ లాభం లేదు
పంటను ఊరిలో దానం చేసినా నిమ్మలం ఉండేది. వేలకు, వేలు కిరాయిలు పెట్టుకుని పంటను మార్కెట్‌‌కు తీసుకొస్తే… దళారులు సొమ్ము చేసుకుంటుండ్రు. 12 శాతం కమీషన్‌, క్వింటాలుకు 20కిలో తరుగు ఇక మాకు ఏం మిగిలింది. ఇందుకేనా ఈ మార్కెట్‌ ‌వ్యవస్థ ఉంది. ప్రభుత్వం తక్ష‍ణమే మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీని నివారించాలి.
కృష్ణ గౌడ్‌ ‌మామిడి రైతు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూర్‌

ఏజెన్సీలకు 4 శాతం కమీషన్‌ ‌మాత్రమే ఇవ్వాలి
మార్కెట్‌‌లో రైతుల పంటను అమ్మిపెట్టినందుకు.. అమ్మిన పంటకు వెంటనే డబ్బులు ఇస్తే.. అందుకు ప్రభుత్వ మార్కెటింగ్‌ ‌నిబంధనాల ప్రకారం 4శాతం కమీషన్‌ ఇవ్వాలి. అధికంగా వసూళ్లు చేసినట్టు తెలిసిన, రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆ ఏజెన్సీల లైసన్స్‌ ‌రద్దు చేసి చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాస్‌, ‌బాటసింగారం మార్కెట్‌ ‌కార్యదర్శి ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -