నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లో భారీగా నగదు, బంగారం పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి బంధువు ఇంట్లో ఏకంగా రూ. 28 కోట్ల నగదు, రూ. 21 కోట్ల విలువైన 15 కిలోల బంగారం బయటపడింది. బీర్భూమ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నోట్ల కట్టలను లెక్కించేందుకు పోలీసులు తీసుకొచ్చిన ఐదు కౌంటింగ్ మిషన్లు కూడా మొరాయించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. బీర్భూమ్‌కు చెందిన మినార్ మండల్ అనే బస్ డ్రైవర్ ఇంట్లో నిన్న రాత్రి పోలీసులు దాడులు ప్రారంభించారు. ఉదయానికి స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ. 28 కోట్లకు చేరింది. మినార్ మండల్.. టీఎంసీ మాజీ నేత అనుబ్రత మండల్‌కు సన్నిహితుడైన వ్యాపారి తులు మండల్‌కు బంధువు. ఇటీవల తులు మండల్, టీఎంసీ రెబల్ వర్గంలో చేరారు.
పోలీసులు మినార్ మండల్‌ను అరెస్ట్ చేయగా, విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. పట్టుబడిన డబ్బు, బంగారం అంతా తులు మండల్, అతని ‘అక్రమ సిండికేట్’కు చెందినదని అంగీకరించాడు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. ఇసుక మాఫియాపై ఇది తమ ప్రభుత్వ ఉక్కుపాదమని, అవినీతిపై జీరో-టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తామని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ దాడులు నిర్వహించిన బీర్భూమ్ పోలీసులను ఆయన అభినందించారు.



