Sunday, May 31, 2026
E-PAPER
Homeజోష్'అందె''డప్పు.. . అంతర్జాతీయ గుర్తింపు

‘అందె”డప్పు.. . అంతర్జాతీయ గుర్తింపు

- Advertisement -

జానపద కళా నృత్యాలకు నెలవు మన దేశం. అలాంటి కళలలో డప్పు వాయిద్యం కూడా ఒకటి. డప్పు దరువు కేవలం శబ్దం కాదు, అది అణచివేతపై నిరసన గళం… శ్రమజీవి గుండె చప్పుడు. అలాంటి డప్పును దేశం గుర్తించే స్థాయికి తీసుకెళ్లి, ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ అవార్డు తీసుకొచ్చిన తెలంగాణ యువకుడు అందె భాస్కర్‌. అవార్డు గ్రహీతగా జాతీయ వేదికలపై మెరిసినప్పటికీ, ఆయన నిరంతరం క్షేత్రస్థాయిలో డప్పు కళాకారుల హక్కుల కోసం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శ్రమిస్తున్నాడు. తన అసాధారణ ప్రతిభతో తెలంగాణ డప్పు చప్పుడును దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో మారుమోగించిన నిఖార్సైన ఆ ప్రజా కళాకారుడితో ముచ్చట ఈ వారం మన జోష్‌…

కేంద్ర సంగీత అకాడమీ 1954లో ఏర్పడిన నాటి నుండి సుమారు 70 ఏండ్ల తర్వాత డప్పు వాయిద్యకారుడికి దక్కిన అరుదైన గౌరవం ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారం. ఆ తొలి పురస్కారం తెలంగాణ యువకుడు అందె భాస్కర్‌ అందుకోవడం విశేషం. ఉమ్మడి మెదక్‌ జిల్లా (ప్రస్తుత సిద్ధిపేట), మీడిదొడ్డి మండలంలోని అందే గ్రామానికి చెందిన శాంతమ్మా, బాలయ్య దంపుతుల సంతానం భాస్కర్‌. ‘చిన్నతనం నుంచి నాకున్న ఆసక్తి అవార్డు వరకు తీసుకెళ్ళింది’ అంటూ సగౌరవంగా చెబుతాడు భాస్కర్‌.

డిగ్రీలో గోల్డ్‌ మెడల్‌
1 నుండి 7వ తరగతి వరకు సొంత గ్రామంలోనే పూర్తి చేశాడు. ఇక 8,9 కొండపాక సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లో చదువుకున్నాడు. 9వ తరగతి అయిపోయాక ఆ హాస్టల్ మూసివేయడంతో అక్కడి నుంచి 10వ తరగతికి పాలమాకుల సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ లోకి మారాల్సి వచ్చింది. ఇంటర్‌ మీడిదొడ్డిలోని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసి, డిగ్రీ నిజాం కళాశాలలోనే చదివాడు. అప్పటి వరకు యావరేజ్‌ స్టూడెంట్‌ గా ఉన్న భాస్కర్‌ డిగ్రీలో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. అంతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కేవలం 40 మందికి మాత్రమే ఇచ్చే యూజీసీ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ సైతం భాస్కర్‌ అందుకున్నాడు. పీజీలో ఎమ్‌ఎ తెలుగు రామచంద్ర ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ లో పూర్తిచేసిన అతడు పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీలో MPA(Master OF Performing Arts), , ఎంసీజే(MCJ), ఎంఫీల్‌ పూర్తి చేసి ప్రస్తుతం దానిలోనే పీహెచ్డీ చేస్తూన్నాడు.

తాతే మొదటి గురువు
చిన్నతనం నుండి తాత, తండ్రి వద్ద డప్పు నేర్చుకున్నాడు. ఆ తర్వాత కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, చిట్టూర్పు గ్రామానికి చెందిన కుంపటి సూర్య భగంతిరావు దగ్గర శిక్షణ పొందాడు. ప్రపంచ దేశాలు తిరిగి డప్పు నేర్పించడం, 1975లో ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో డప్పు ప్రదర్శన ఇచ్చిన వ్యక్తి కుంపటి సూర్య భగంతిరావు. 40 వేల మందికి పైగా ఆయన దగ్గర శిక్షణ పొందారంటే ఆయన ఎంత గొప్ప గురువో వేరే చెప్పాల్సిన పని లేదు. వారిలో భాస్కర్‌ ఒకరు.

గణతంత్ర వేడుకలో ప్రదర్శన
తెలంగాణ మట్టి కళారూపం, అణగారిన వర్గాల ఆత్మఘోషకు ప్రతీక అయిన ‘డప్పు’ మరోసారి దేశ రాజధానిలో మారుమోగింది. భారత ప్రభుత్వం ప్రతిష్టంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో నారి శక్తి తీమ్‌ నుంచి తెలంగాణ శకటం ద్వారా అందే మ్యూజిక్‌ అకాడమీ నుండి 24 మంది మహిళలతో ఇచ్చిన డప్పు కళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో వరుసగా మూడుసార్లు ప్రదర్శన ఇచ్చారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున డప్పు కళా ప్రదర్శన ఇచ్చారు. హైదరాబాద్‌ లో మిస్‌ వరల్డ్‌ 2025 వేదిక పైన చిర్రె, చిటికెనతో దరువై మోగాడు భాస్కర్‌. ఓయూ వందేండ్ల ఉత్సవాల్లో కూడా ప్రదర్శన ఇచ్చాడు.

అంతర్జాతీయ వేదికలపై
కొట్టే డప్పు దరువు.. గజ్జెకట్టి ఆడే చిందు, ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు… కాలిపాదాలు లయబద్ధమైన చప్పుడు… కరతాళ ధ్వనులు.. ఇవి అందే మ్యూజిక్‌ అకాడమీ. అబుదాభి, దుబారు, న్యూజిలాండ్‌, మలేషియా వంటి అంతర్జాతీయ వేదికపై డప్పు ప్రదర్శనతో మూటకట్టుకున్న జ్ఞాపకాలు అతనివి.

డప్పు కళకు కొత్త ఊపిరి
డప్పును కేవలం ఒక సాంప్రదాయ వాయిద్యంగానే కాకుండా సామాజిక చైతన్యానికి, మహిళా సాధికారతకు ఒక సాధనంగా మలిచారు భాస్కర్‌. తెలంగాణ భాషా సాంస్కృతిక‌ శాఖ ప్రోత్సాహంతో, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3000 మందికి పైగా ఆడబిడ్డలకు డప్పు దరువుల్లో శిక్షణ ఇచ్చి, పురుషులకే పరిమితమనే భావన ఉన్న ఈ కళలో మహిళలను సైతం అద్భుత ప్రదర్శనలు ఇచ్చేలా తీర్చిదిద్దారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగం వదిలేసి
కానిస్టేబుల్‌ గా ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న సమయంలో అది అతనికి అంత సంతృప్తిని ఇవ్వలేదు. అంతేకాదు తన తల్లిదండ్రులకు సైతం కొడుకు ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. దాంతో ఆ ఉద్యోగం మధ్యలో వదిలి డప్పు వాయిద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ”ఉద్యోగం చేస్తే నాకు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ అవార్డు వచ్చేది కాదు.. ఉద్యోగం వదిలేసాను కాబట్టే అవార్డు వచ్చింది” అని అంటాడు అతడు.

ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం గురించి
షహనారు విద్వాంసుడు భారతరత్న ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పేరు మీద 2006లో పురస్కారాన్ని స్థాపించారు. ఈ పురస్కారం సంగీతం, నృత్యం, నాటక రంగాలలో ప్రతిభ ప్రదర్శించిన 40 ఏండ్లలోపు కళాకారులకు భారత ప్రభుత్వ సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ అందిస్తుంది.

వారి ప్రోత్సాహం మరువలేనిది: అందె భాస్కర్‌
ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం యువకులకి పద్మ శ్రీ లాంటిది. అవార్డు రావడానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అప్పటి డైరెక్టర్‌ డాక్టర్‌ మామిడి హరికృష్ణ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. ఇలాంటిది ఒక అవార్డు ఉంది అనీ, దీనికి నాపేరు దరఖాస్తూ చేసిన విషయం కూడా నాకు తెలియదు. అవార్డు ప్రకటించిన తర్వాతే నాకు దీని గురించి తెలిసింది. నాకు అనునిత్యం అండగా ఉంటూ, పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న నా భార్య గంగా జమునకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకూ ఎలాంటి సంపాదనా లేకపోయినా ధైర్యం చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది.

ఓదెల రాజబాపు, 9493261367

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -