Sunday, August 9, 2026
E-PAPER
Homeజోష్జెన్‌ ఆల్ఫా తరం

జెన్‌ ఆల్ఫా తరం

- Advertisement -

‘నేను చెప్పాను కాబట్టి చెయ్!’ అంటే ఎందుకు చేయాలి?, ‘నేను హోంవర్క్‌ ఎందుకు ఇప్పుడే చేయాలి?’, ‘నువ్వు ఫోన్‌ చూస్తున్నప్పుడు నేనెందుకు చూడకూడదు?’ వంటి ప్రశ్నలతో తల్లిదండ్రులను లాక్‌ చేస్తున్నారు. పెద్దలు ఆదేశాలను గుడ్డిగా పాటించడం కాదు, వాటి వెనుక ఉన్న కారణాలను, స్పష్టతను కోరుకుంటున్నారు. మిలీనియల్స్‌ చేతుల్లో పెరుగుతున్న ఇప్పటి తరం పిల్లలు ప్రతిదానికీ హేతుబద్ధతను కోరుకుంటున్నారు. మాటలు రాకముందే ఐపాడ్‌ టచ్‌స్క్రీన్‌ను నెట్టే వేళ్ళు… అలెక్సా, సిరిలతో రోజూ పిచ్చాపాటి ముచ్చట్లు… బొమ్మల కంటే ‘రోబ్లాక్స్‌’ అవతార్లకే ఎక్కువ ప్రాధాన్యత.. ఇది ఏదో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో దృశ్యం కాదు… ఈనాటి ప్రతి ఇంట్లో కనిపిస్తున్న నయా ట్రెండ్‌! 21వ శతాబ్దంలో పూర్తిగా కన్నుతెరిచిన తొలి తరం ‘జెన్‌ ఆల్ఫా’ (Gen- Alpha) ప్రపంచాన్ని శాసించడానికి సిద్ధమవుతోంది.

ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో తెలియాలంటే నేటి తరం పిల్లల వైపు చూడాలి! మిల్లేనియల్స్‌ స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేసుకున్నారు. జెన్‌-జెడ్‌ సోషల్‌ మీడియా యుగంలో పెరిగింది. కానీ ‘జెన్‌ ఆల్ఫా’ మాత్రం చేతిలో డిజిటల్‌ స్క్రీన్‌తోనే కన్నుతెరిచిన తొలి తరం! ఆల్ఫా తరం ఆలోచనలు, అలవాట్లు గత తరాల కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) నెటిజన్లు: వీరికి ‘అలెక్సా’, ‘సిరి’, ‘చాట్‌జిపిటి’లు వింత కాదు. రోజువారీ ఆటవస్తువులు! మాటలు రాకముందే వాయిస్‌ కమాండ్స్‌తో యూట్యూబ్‌లో కాటూన్లు పెట్టుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
స్క్రీన్ల నడుమ పెంపకం: ఆన్‌లైన్‌ క్లాసులు, ఐపాడ్‌లు, విఆర్‌ హెడ్‌సెట్‌ల మధ్య పెరిగిన తరం ఇది. పుస్తకాల కంటే దృశ్య రూపంలో నేర్చుకోవడానికే వీరు ఎక్కువ మొగ్గు చూపుతారు.

హైపర్‌-కనెక్టెడ్‌ ప్రపంచం: ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా, ఏ గేమింగ్‌ ట్రెండ్‌ నడుస్తున్నా వీరికి చిటికెలో తెలిసిపోతుంది. ‘రోబ్లాక్స్‌’, ‘మైన్‌క్రాఫ్ట్‌’ వంటి వర్చువల్‌ ప్రపంచాల్లో వీరు గంటల కొద్దీ సమయం గడుపుతారు
.
సామాజిక స్పృహ: చిన్న వయస్సులోనే పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై వీరికి స్పష్టమైన అవగాహన ఉంటోంది.
తల్లిదండ్రులు, సమాజం ముందున్న సవాళ్లు
1. డిజిటల్‌ అడిక్షన్‌ డ స్క్రీన్‌ టైమ్‌: నిరంతరం స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కంటి సమస్యలు, శారీరక శ్రమ తగ్గడం, ఏకాగ్రత లోపించడం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి.
2. సోషల్‌ స్కిల్స్‌ తగ్గుముఖం: వర్చువల్‌ ప్రపంచంలో ఫ్రెండ్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల నిజ జీవితంలో నేరుగా మాట్లాడే నైపుణ్యాలు వీరికి తగ్గుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3. సూనహనం లోపించడం: ప్రతిదీ ఒక క్లిక్‌తో క్షణాల్లో అయిపోయే యుగంలో పెరగడం వల్ల, ఓర్పు లేదా సహనం కాస్త తక్కువగా ఉంటోంది.

భవిష్యత్తు వీరిదే!
2025 నాటికి ఈ ఆల్ఫా తరం జనాభా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మానవ చరిత్రలోనే అత్యంత విద్యారంగంలో ముందంజలో ఉండే, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తరం వీరే కానున్నారు. సాంకేతికతను సరిగ్గా వాడుకుంటూ, శారీరక ఆరోగ్యం, మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చేలా వీరిని తీర్చిదిద్దడమే నేటి తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద బాధ్యత!

బ్రాండ్లను శాసించే పిడుగులు
పూర్వం ఇంట్లో ఏదైనా వస్తువు, కార్‌ లేదా టీవీ కొనాలంటే ఇంట్లోని పెద్దలు నిర్ణయించేవారు. కానీ ఆల్ఫా తరంలో పరిస్థితి తలకిందులైంది.
బ్రాండ్‌ అవేర్‌నెస్‌: 8-10 ఏళ్ల వయస్సులోనే ఏ బ్రాండ్‌ మంచిది, ఏ గాడ్జెట్‌లో ఏ ఫీచర్స్‌ ఉన్నాయో వీరికి క్లియర్‌ కట్‌ అవగాహన ఉంది.
షాపింగ్‌ ప్రాధాన్యతలు: కుటుంబ కొనుగోళ్లలో (Shopping) ఆల్ఫా పిల్లల పాత్ర చాలా కీలకంగా మారింది. తల్లిదండ్రులు కూడా వీరి ఇష్టాయిష్టాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
వర్చువల్‌ ఎకానమీ: నిజ జీవితంలో బట్టలు, బొమ్మలు కొనడమే కాకుండా.. రోబ్లాక్స్‌ లేదా మైన్‌క్రాఫ్ట్‌ గేమ్‌లలో తమ ‘అవతార్‌’ (Avatar) కోసమే డిజిటల్‌ దుస్తులు, స్కిన్స్‌ కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.



సరికొత్త క్లాస్‌ రూమ్స్‌
ఆల్ఫా తరం కోసం సాంప్రదాయ ‘బల్ల-నల్లబల్ల’ చదువులు సరిపోవడం లేదు. అందుకే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.
AI & కోడింగ్‌ (Coding): బడి వయసులోనే వీరికి కోడింగ్‌, రోబోటిక్స్‌, AI ప్రొంప్టింగ్‌ నేర్పిస్తున్నారు.
చదువు + ఆట (Gamified Learning): పాఠాలు కేవలం బట్టీ పట్టడం కాకుండా, క్విజ్‌లు, త్రీడీ (3ణ) మోడల్స్‌, యానిమేషన్ల ద్వారా కథల రూపంలో నేర్చుకుంటున్నారు.
గ్లోబల్‌ క్లాస్‌రూమ్‌: ఒకే గదిలో కూర్చుని ప్రపంచంలోని వేర్వేరు దేశాల విద్యార్థులతో కలిసి ప్రాజెక్ట్‌లు చేసే సాంకేతికత వీరికి అందుబాటులోకి వచ్చింది.
‘జెన్‌ ఆల్ఫా’ స్లాంగ్‌
జెన్‌-జెడ్‌కు ‘Cap/No Capμ, ªRizzμ’ ఎలాగో.. ఆల్ఫా తరానికి కూడా తమదైన ప్రత్యేకమైన ఇంటర్నెట్‌ లాంగ్వేజ్‌ ఉంది. సోషల్‌ మీడియాలో వీరు వాడే కొన్ని పదాలు:
Skibidi (స్కిబిడి): పరిస్థితిని బట్టి ‘కూల్‌’ అని లేదా ‘చెత్తగా ఉంది’ అని చెప్పడానికి వాడే పదం.
Fanum Tax (ఫ్యానమ్‌ టాక్స్‌): స్నేహితుడి ప్లేట్‌ నుంచి ఆహారాన్ని దొంగిలించి తినడం!
Sigma (సిగ్మా): చాలా ధైర్యంగా, స్వతంత్రంగా ఉండే వ్యక్తిని పొగడటానికి వాడే మాట.
Gyatt(గ్యాట్‌): ఏదైనా చూసి ఆశ్చర్య పోయినప్పుడు వాడే పదం.

సవాళ్లు..
స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన వాడకం వల్ల జెన్‌ ఆల్ఫా పిల్లల్లో ఏకాగ్రత దారుణంగా పడిపోతోంది. సొంత ఆలోచనా శక్తి, విమర్శనాత్మక పరిశీలన దెబ్బతింటున్నాయి. అలాగే, ఆటో- కరెక్ట్‌ ఫీచర్ల వల్ల సొంతంగా స్పెల్లింగులు రాయలేకపోతున్నారు. పుస్తకాలు చదవడం మానేసి, డిజిటల్‌ పదజాలానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా వీరిలో భాషా నైపుణ్యాలు లోపిస్తున్నాయి.
ఒక వస్తువును కొనడానికి మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుందని అడిగినప్పుడు, జెన్‌ ఆల్ఫా ప్రతివాదులలో 61% మంది సోషల్‌ మీడియా అని పేర్కొన్నారు. ఈ సంఖ్య తోటివారి ప్రభావం (56%) కంటే ఎక్కువ. టీవీ ప్రకటనలు (48%) లేదా దుకాణంలో వస్తువులను చూడటం (53%) వంటి సాంప్రదాయ మార్గాలను గణనీయంగా అధిగమించింది. సర్వేలో పాల్గొన్న అతి చిన్న పిల్లలైన 7 నుండి 9 సంవత్సరాల వయస్సు వారిలో కూడా, 57% మంది తాము కొనే వస్తువులను సోషల్‌ మీడియా ప్రభావితం చేస్తుందని చెప్పారు.

టీచర్లకు సవాల్‌!
ఏఐ ప్రపంచంలో జన్మించిన జెన్‌ ఆల్ఫా- మునుపటి తరాల కంటే భిన్నమైన అంచనాలు, నైపుణ్యాలు, సవాళ్లతో తరగతి గదుల్లోకి అడుగుపెడుతోంది. వీరు పుట్టిందే మొదలు ఏఐ ఆధారిత పరికరాలతో సంభాషిస్తున్నారు. అక్షరాలు నేర్వడానికి ముందే ప్రాథమిక డిజిటల్‌ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. అందుకే వీరు తక్షణ ఫీడ్‌బ్యాక్‌, ఇంటరాక్టివ్‌ కంటెంట్‌, మల్టీమోడల్‌ లెర్నింగ్‌ వాతావరణాన్ని కోరుకుంటున్నారు.

– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -