నవతెలంగాణ – హైదరాబాద్ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అర్ధరాత్రి గ్యాస్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ట్యాంకర్ అంబులెన్స్‌తో పాటు ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు (36) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మిర్యాలగూడలోని నందిపాడు సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఓ వ్యక్తి బైక్‌పై నుంచి కిందపడినట్లు గుర్తించిన శ్రీనివాసరావు.. అతడికి సహాయం చేసేందుకు కారును రోడ్డు పక్కన నిలిపి 108కు సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్ అక్కడికి చేరుకోగా, బాధితుడిని అందులోకి ఎక్కిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి అంబులెన్స్‌తో పాటు ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, అంబులెన్స్ మధ్య శ్రీనివాసరావు చిక్కుకుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ సిబ్బంది స్వప్నకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.



