Monday, July 20, 2026
E-PAPER
Homeజోష్అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -6)

అమలిన ప్రేమకథ (ఎపిసోడ్ -6)

- Advertisement -

తెల్లారితే రంజాన్ కదా ! పొద్దున్నే లేవాల్సి ఉంది.ఇక పడుకుందామని అలీసాబ్ ఇంట్లోకి వెళ్తాడు.

రజియా! ఏమయ్యో! రేపటికి బిర్యానీ చేయాలి కదా.
సామాన్లేవి. నీ ఆలోచనలు నీకే. మాకు ఏం కావాలో పట్టించుకొనుడు లేదు. మీ చెల్లెలికి మటన్ ఇష్టం. చికెన్ గిట్ల తెచ్చేవు.

అన్ని తెచ్చి కిచెన్ల పెట్టిన. మా చెల్లెలు వచ్చిందన్న సంతోషంలా నువ్వు ఏడ చూస్తున్నవు.
జమాల్ భాయ్ కి చెప్పినలే. పొద్దుగాల్నే ఓ పోగు ఎత్తుకొత్త.
ఎంత రేత్రయినా మాల్, మసాలా రెడీ చేసుకో.

ఇక నువ్వు పడుకో. అసలే ఆరోగ్యం బాగా లేదు.
నిద్రపట్టకపోతే పొద్దంతా ఎట్లనో జేస్తవు.

సరే అని అలీసాబ్ పడుకున్నాడు. నిజానికి అతని లోపలి ఆలోచనలు అతన్ని పడుకోనిస్తలేవు. చెల్లెలి మీద పెట్టుకున్న కలలు, ఊర్లో చెల్లెలి గూర్చి మాట్లాడిన మాటలు, ఓ పక్క రవి ఒకే కులం, మతం కాదన్న విషయం అతని మీద దాడి చేస్తున్నాయి.
కొద్ది సేపు ఇటు తిరిగి, కొద్ది సేపు అటు తిరిగి పడుకుంటున్నాడే తప్ప నిద్రపోవటం లేదు. కాస్త కాస్త అలీసాబ్ తనలోంచి తాను దూరమవుతున్నాడు.
అప్పుడిక అలీసాబ్, అలీసాబ్ కాదు. మూర్ఖత్వం ఆవహించిన కసాయిలా తయారయ్యాడు.
పొద్దున్నే లేచి పోగు ఎత్తుకు రావడానికి వెళ్ళాడు.
అక్కడంతా అలీసాబ్ ను చూసి గుసగుసలు మాట్లాడుతున్నారు. ఒకటే ఇక ఇకలు పక పకలు.
అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళ ప్రవర్తన ఇంకా ఇంకా రెచ్చగొట్టింది. అక్కన్నుంచి పోగు తీసుకొని అలీసాబ్ ఇంటికొచ్చాడు.

రజియా ఎదురెళ్లి పోగు ఉన్న కవర్ తీసుకుంది.
నాకు కార్జం ముక్కలు ఇష్టమని తెలుసు కదా! వేయించుకొచ్చినవ భాయి అని అన్న చెయ్యి పట్టుకుంది.

నీకు ఏవేవి ఇష్టమో తెలుసు.నేను ఏం ఏం చేయాలో నాకు తెలుసు. నేను కొనిచ్చిన గాజులు, కొత్తబట్టలు వేసుకొని నువ్వు,రవి తయారు కాండి అంటూ ఇంట్లోకి వెళ్తాడు.
ఈ విషయాల్లో నలిగిపోయి పండుగపూట నమాజు చేయడమూ మర్చేపోయాడు. ఆయనలో అంతకంతకు రాక్షసత్వం పెరిగిపోతుంది. అలీసాబ్ ఎంతో మంచి మనసు కలవాడు.

ఈ విషయంలో అంత చెడ్డగా మారిపోయాడు. అలా మార్చింది సమాజం.

పర్వీన్ సేమియా చేస్తుంది. రజియాకు వదిన చేసే సేమియా చాలా ఇష్టం.ఆ ఇంట్లో మొదలు రజియా తిన్నాకనే అందరు తింటారు.

ఈ సారి రవి తోడయ్యాడు కాబట్టి మొదలు వాళ్ళిద్దరి చేత తినిపించి నోరు తీపి చేద్దామనుకుంది పర్వీన్.
పిల్లలు సేమియా సేమియా అంటుంటే
“అత్తయ్య, మామ సేమియా తాగాకే మనం తాగాలి” అని పిల్లలకు వార్నింగ్ ఇస్తుంది.

అలీసాబ్ ఏం చేయాలి? ఎలా నేను అనుకున్నది. నెరవేర్చుకోవాలని ఆలోచనలో పడ్డాడు. ముందు సేమియా వాళ్ళిద్దరికి తినిపిస్తున్నానని పర్వీన్ చెప్పంగనే ఇతనికో ఆధారం దొరికినట్టయింది.

పర్వీన్ సేమియా గ్లాసుల్లో నింపి పిల్లలను సముదాయిస్తుంది.
కిచెన్ రూంలోంచి ఆదరాబాదరాగా బయటికొస్తూ
“బయట అర్జెంటు పని ఉంది.పోయొస్తా” అని అలీసాబ్ వెళ్ళిపోతాడు.

అంతకు ముందే పర్వీన్ గ్లాసుల్లో సేమియా పోసి ఉంచింది.చల్లారుతుంది ఎట్లా? అని రజియా! నువ్వు, రవి ఈ సేమియా తాగండని ఇవ్వబోతుంది.
అన్న లేడు కదా! అన్నొచ్చినంక తాగుతం అంటుంది.
మీ అన్న బయటికి పోతే వస్తడ ఇక. ఏ పొద్దూకుద్దో.
తాగండి అంటుంది.

రజియా , రవి కొత్త బట్టల్లో పెళ్లి కూతురు, పెళ్ళికొడుకులను తలపిస్తున్నరు. అది చూసి పర్వీన్ మీ జంటను చూస్తుంటే ఎవరి దిష్టో తగిలేటట్టే ఉంది అని పరిహాసం చేస్తుంది.
రజియా సగం తాగి రవికిస్తుంది. రవి సగం తాగి రజియాకిచ్చాడు.
ఆ రెండు గ్లాసుల్లోని సేమియా పూర్తిచేశారు.

అలీసాబ్ బాయికాడికి పోయి కళ్ళనిండా నీళ్ళు తీసుకుంటున్నడు. అసలు నేనలా చేయకపోయి ఉంటే బాగుండేది అని కొంతసేపు.

అలా చేయడమే సరియైనదని కొంతసేపు తర్జన భర్జన పడుతున్నాడు. కొంతసేపటికి చెల్లెల్ని ఎత్తుకొని అల్లారుముద్దుగా పెంచిన రోజులు గుర్తొచ్చాయి.
అమ్మ చనిపోతూ చనిపోతూ చెల్లె జాగ్రత్తరా ! అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చెల్లెలిని ఒడిలో కూర్చోబెట్టుకొని కథలు చెప్పిన రోజులు గుర్తొచ్చాయి.

మళ్ళీ అలీసాబ్ తనలోకి తాను వచ్చేశాడు. ఈ సమాజం గురించి నాకవసరం లేదు. ఈ మనుషుల గురించిన పట్టింపు లేదనుకొని మనసును నిమ్మలపరుచుకున్నడు.
ఒక్కసారిగా పరువు, ప్రతిష్ట అనే మైకం దిగిపోయింది.
సరే! ఎక్కడో చోట నా చెల్లి బతికితే చాలు అని
ఒక్క చిత్తం చేసుకున్నడు.

అయ్యో! నా చెల్లె.ఎంత ప్రేమగా పెంచుకున్ననే. నా బిడ్డలెక్కనే చూసుకున్న. నీ జీవితంలో మన్ను కొట్టబోతున్ననే అనుకుంటూ
సేమియాలో విషం కలిపిన విషయం గుర్తొచ్చి పరిగెత్తుకొస్తున్నడు.

రవి, రజియా సేమియా తాగిన కొంతసేపటికి కళ్ళు తేలేస్తున్నారు.పర్వీన్! రజియా ఏంటి ఎట్లనో చేస్తున్నరు.ఏమైంది, ఏమైంది అంటూ తనను ఒడిలోకి తీసుకుంది.రవి మంచం మీదే పడిపోయాడు. నోట్లోనుంచి నురగలు రానే వస్తున్నాయి. పర్వీన్ మొత్తుకున్నది చూసి రఫి ఉరుకొచ్చాడు. ఆర్.ఎం.పి సుధాకర్ ను పిలిపించాడు.
నోట్లోంచి వస్తున్న నురగలు చూసి “విషం తాగి నట్టున్నారు” అని వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలని సలహా ఇచ్చాడు.

జీబు మాట్లాడుదామని ఊళ్ళోకి పోతే ఇప్పుడే పక్కూరుకు కిరాయి పోతున్నడని తెలిసింది.
మూల తిరుగొచ్చు అని చెప్పంగనే రఫీ బండి తీసుకుని పోయి జీబతన్ని దొరకబట్టిండు. అప్పటికే ఓ ఇరవై నిమిషాలు గడిచిపోయింది.

అప్పటికే అలీసాబ్ అక్కడికి చేరుకుండు.
అయ్యో! మొదనష్టపోన్ని నేనే విషం కలిపిన్నే.
పరువుకోసం పోయి బంగారం లాంటి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తున్ననే అని బోరున ఏడుస్తుండు.
పర్వీన్ ! ఎంత పని చేసినవయ్యా! ఈ బుద్ధి నీకెట్ల పుట్టిందని ఏడుస్తూ తిడుతుంది.

ఇవన్నీ తర్వాత గని ముందు హాస్పిటల్ కు తీసుకుపోర్రి అని రవిని,రజియాను జీబు ఎక్కించిర్రు.
పర్వీన్ , అలీసాబ్ జీబులో హాస్పిటల్ కు తీసుకుపోతున్నరు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -