ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనదైన వంటకంగా గర్వంగా చెప్పుకునేది, కనిపించేది ఒక్క ‘హైదరాబాద్ బిర్యానీ’ మాత్రమే. అదే సమయంలో చైనా నూడిల్స్, యూరోపియన్ పాస్తా, అమెరికన్ పిజ్జా, బర్గర్లు మాత్రం మన పల్లెటూరి గల్లీల్లో సైతం రాజ్యమేలుతున్నాయి. ”ఇంతకంటే అద్భుతమైన రుచి, పోషకాలు, చారిత్రక నేపథ్యం ఉన్న వంటకాలు మన సొంత గడ్డపై ఎన్నో ఉంటే… అవి విదేశీయులను ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయి? కేవలం మన వంటకాలను రుచి చూసేందుకే విదేశీ ‘ఫుడీస్’ క్యూ కట్టాలంటే ఏం చేయాలి?”
ఈ ఒక్క ప్రశ్న హైదరాబాద్‌కు చెందిన గోపి అనే యువకుడి ఆలోచనలను మార్చేసింది. తెలంగాణ రుచులను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాలనే కంకణంతో సరికొత్త ‘వెరైటీ’ల దారి పట్టేలా చేసింది.
మూలాల వేట!
తన సంకల్పాన్ని నిజం చేయడానికి గోపి సుమారు మూడేండ్లపాటు విస్తతంగా అధ్యయనం చేశాడు. నగరాల ఫైవ్‌స్టార్ హోటళ్లు చూట్టూ కాకుండా గిరిజన తండాలు, పల్లెలు తిరుగుతూ సామాజిక వర్గాల వారీగా ఉండే సాంప్రదాయ వంటకాలను పరిశీలించాడు. ఆదిలాబాద్ అడవుల్లోని గిరిజన గూడేలకు వెళ్లి, అక్కడ ‘ఇప్పపువ్వు’తో చేసే ప్రత్యేక వంటకాల రహస్యాలను తెలుసుకున్నాడు. ఈ పరిశోధనలోనే ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది…ఒక్క తెలంగాణలోనే ఒక్క వంకాయతోనే దాదాపు 75 రకాల కూరలు వండుతారట!
కాకతీయ రుచి… ఫ్రెంచ్ శైలి!
మన స్థానిక వంటకాలు విదేశీయుల జిహ్వకు నచ్చుతాయా లేదా అనే అనుమానాన్ని పటాపంచలు చేయడానికి గోపి నగరంలోని ప్రఖ్యాత షెఫ్‌లతో చేతులు కలిపాడు. మక్క గుడాలు, గోంగూర మటన్, సర్వపిండి, రాగి, జొన్న లడ్డూలను విదేశీయుల టేస్ట్‌కు తగినట్టుగా రీ-డిజైన్ చేశాడు. ఇటీవల ఆయన తెలంగాణ – ఫ్రెంచ్ వంటకాలను మేళవిస్తూ ‘కాకతీయ ఫ్రెంచ్ శైలి’ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్యూజన్ విందుకు విదేశీ ప్రతినిధుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన షెఫ్‌లు సైతం ఈ సరికొత్త రుచికి ఫిదా అయిపోయారు. ఈ ఉత్సాహంతోనే త్వరలోనే నెదర్లాండ్స్, దుబారు వంటకాలతో కూడా ఇలాంటి ఫ్యూజన్ ప్రయోగాలు చేయడానికి గోపి సిద్ధమవుతున్నాడు.
మ్యాజిక్ అంతా మసాల ‘మోతాదు’లోనే
”మన దేశంలో మసాలాలు ఎక్కువగా వాడుతారని విదేశీయులకు ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజానికి మన దగ్గరి నుంచే దినుసులు తీసుకెళ్లి వాళ్లు వాడుకుంటున్నారు. ఆ దినుసులను ఏ మోతాదులో వేస్తే విదేశీయులకు నచ్చుతుందో రీసెర్చ్ చేసి, మన ఒరిజినల్ ఫ్లేవర్ దెబ్బతినకుండా ఆహారాన్ని సిద్ధం చేయడమే నా టార్గెట్. అసలు మ్యాజికంతా మసాలలోనే ఉంటుంది. అది ఏ మోతాదులో ఉపయోగించాలో తెలిస్తే చాలు. ఫ్రాన్స్, మెక్సికో, స్కాండినేవియన్ దేశాల ఫుడ్ టూరిస్టులు ఆహారం కోసం చాలా బాగా ఖర్చు చేస్తారు. వారిని ఆకట్టుకునే మెనూతో మనవైపు తిప్పుకుంటే ఇక్కడ ఫుడ్ టూరిజం అద్భుతంగా పెరుగుతుంది” అని ధీమాగా చెబుతున్నాడు గోపి. స్థానిక రుచులకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుని, గ్లోబల్ ప్లేట్‌పై… తెలంగాణ రుచుల జెండా ఎగరేస్తున్నడు గోపి.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417



