నవతెలంగాణ-వర్గల్
మండలంలోని మీనాజిపేట్ గ్రామ ఉన్నత పాఠశాలలో గత 10 రోజుల క్రితం టీవీ ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. టీవీని చోరీ చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు గౌరారం ఎస్సై ఆరోగ్యం తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన కాటి మహేష్ (24) వాహనాలు అద్దెకు తీసుకుని ఓలా, ఉబర్, ర్యాపిడో, వంటి ఆన్లైన్ ద్వారా ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన భార్య టీవీ కావాలని కోరడంతో సులభ మార్గంగా చోరీకి పాల్పడ్డాడు.
ఈ నెల 19న రాత్రి మీనాజిపేట్ ఉన్నత పాఠశాల ల్యాబ్ తాళం పగులగొట్టి అందులో ఉన్నటువంటి 64 అంగుళాల టీవీని తీసుకోని పొదల్లో దాచాడు. శుక్రవారం ఆ టీవీని తీసుకోని గౌరారం రాజీవ్ రహదారిపై బస్సు కోసం వేచి చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడి నుంచి టీవీని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గౌరారం ఎస్సై ఆరోగ్యం, కానిస్టేబుల్ రవి, గౌతం లను గౌరారం సీఐ రవిరాజు అభినందించారు. జనావాసాల్లో అనుమానిత వ్యక్తులు ఏదైనా కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.



