అదనపు కలెక్టర్ పాండు
నవతెలంగాణ-సంగారెడ్డి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం–2026 కింద అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్, బ్యానర్, కరపత్రాలను శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పాండు, జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్‌డీఏ అదనపు పీడీ సూర్యారావుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ.. జిల్లాలోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రక్త సంబంధిత దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ప్రభుత్వం చేయూత సామాజిక భద్రత పింఛన్లను అందిస్తోందన్నారు. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వితంతువులు: 18 సంవత్సరాలు పైబడి, భర్త మరణ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
ఒంటరి మహిళలు: 18 సంవత్సరాలు పైబడి భర్తతో విడిపోయి/ వదిలివేయబడి కనీసం ఒక సంవత్సరం పూర్తయిన వారు, గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు పైబడిన అవివాహితులు అర్హులని తెలిపారు.
దివ్యాంగులు: దివ్యాంగులకు వయస్సుతో సంబంధం లేకుండా అర్హత ఉంటుంది. SADAREM/UDID ధృవీకరణ ద్వారా కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. (51 శాతం వినికిడి లోపం ఉన్నవారికి)
రక్త సంబంధిత దివ్యాంగులు : తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వ్యాధులతో బాధపడుతున్న వారు. సదరం /UDID ధృవీకరణ ఉండాలని తెలిపారు.
కల్లుగీత కార్మికులు: 50 సంవత్సరాలు పైబడి, కల్లుగీత కార్మికుల సహకార సంఘ సభ్యత్వం ఉండాలని, ఎక్సైజ్ శాఖ ధృవీకరణ అవసరమని స్పష్టం చేసారు.
చేనేత కార్మికులు: 50 సంవత్సరాలు పైబడిన వారు అర్హులని, చేనేత, జౌళి శాఖ ధృవీకరణ ఉండాలని తెలిపారు.
పైలేరియా బాధితులు: గ్రేడ్–II, గ్రేడ్–III పైలేరియా వ్యాధిగ్రస్తులు. అర్హులైన వారు సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు/ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు/పురపాలక కమిషనర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.
అలాగే https://cheyutha.telangana.gov.in వెబ్‌సైట్‌లోని “Cheyutha Application Forms” బటన్ నొక్కి దరఖాస్తు ఫారాలను పొందవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి వితంతువు, ఒంటరి మహిళకు దరఖాస్తు చేసుకునే విధంగా మహిళా సమాఖ్యల సహకారంతో దరఖాస్తు ప్రక్రియ మరియు అవసరమైన ధృవపత్రాల విషయంలో సహాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హులైన వారు ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాండు కోరారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ప్రయోజనం అందేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.



