– సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ అమరవీరులకు ఘన నివాళి
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకునేందుకు ప్రజలు మరోసారి ఉద్యమించాలని సీపీఐ(ఎం) మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం దమ్మపేట మండల సీపీఐ(ఎం) కార్యాలయం సుందరయ్య భవన్‌లో బషీర్‌బాగ్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 ఆగస్టు 28న విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో అమరులైన సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిల చిత్రపటాలకు మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పార్టీ మండల కమిటీ సభ్యులు కొప్పుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో దొడ్డా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతుల మేరకు విద్యుత్ సంస్కరణల పేరుతో చార్జీలను పెంచిందన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున రోడ్డెక్కి పోరాటం చేశారని తెలిపారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న ప్రజలపై అప్పటి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపిందని, ఈ ఘటనలో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలు అమరులయ్యారని పేర్కొన్నారు. అమరవీరులకు రెడ్ సెల్యూట్ తెలిపారు.
విద్యుత్ నేడు మానవ జీవనానికి అత్యంత కీలకమైన నిత్యావసరంగా మారిందని అన్నారు. నీరు, విద్య, వైద్యం, ఆహార ఉత్పత్తి మొదలుకొని ప్రభుత్వాల నిర్వహణ వరకు ప్రతి రంగానికీ విద్యుత్ అవసరమని చెప్పారు. ఇలాంటి కీలకమైన విద్యుత్ రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని, 2000 నాటి బషీర్‌బాగ్ పోరాట స్ఫూర్తితో విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కొలికిపోగు శ్రీనివాసరావు, కొలికిపోగు కౌశిక్, కొప్పుల శ్రావణి, కొప్పుల వర్షిణి తదితరులు పాల్గొన్నారు.



