– హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీ కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు
– ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు: దొరికిన వాహనదారులు
నవతెలంగాణ – కామారెడ్డి
రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధించకుండా ప్రేమతో రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్, మహిళా ట్రాఫిక్ సిబ్బంది పోలీస్‌స్టేషన్ ఎదుట వాహనదారులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి బొట్టు పెట్టి రాఖీ కట్టి, “మీ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి” అంటూ సందేశం ఇచ్చారు.
జరిమానాల కంటే అవగాహన ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీసుల వినూత్న కార్యక్రమం వాహనదారులను ఆకట్టుకుంది. భద్రత గురించి ఆలోచిస్తున్న పోలీసులకు వాహనదారుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వినయ్ సాగర్‌తో పాటు మహిళా ట్రాఫిక్ సిబ్బంది శోభ, స్వప్న, అనిత, మూసిన్ ఖాన్, తిరుపతి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.



