Friday, August 28, 2026
E-PAPER
Homeఖమ్మంవిద్యుత్‌ సంస్కరణల వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలి

విద్యుత్‌ సంస్కరణల వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలి

- Advertisement -

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్‌
నవతెలంగాణ – అశ్వారావుపేట 

26 ఏండ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై మోపిన భారాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీల పిలుపుతో అఖిల పక్షాల ఆధ్వర్యంలో జరిగిన వీరోచిత పోరాటంలో ముగ్గురు ప్రాణత్యాగం చేశారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్‌ అన్నారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. బషీర్‌బాగ్‌ లో పోలీసుల కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగానే నేటి వరకు పాలకులు విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనుకంజ వేయాల్సి వచ్చిందన్నారు. ప్రజా పోరాటాల ఒత్తిడితోనే ఉచిత విద్యుత్‌ వంటి హామీలు అమలులోకి వచ్చాయని పేర్కొన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ల ఒత్తిడితో నూతన విద్యుత్‌ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్‌ ధరలను ఎప్పటికప్పుడు పెంచుకునే అవకాశం ప్రైవేటు, బహుళజాతి సంస్థలకు కలుగుతుందని అన్నారు. దీంతో వ్యవసాయ రంగానికి అందుతున్న ఉచిత విద్యుత్‌ దెబ్బతినడంతో పాటు పేదలకు లభిస్తున్న క్రాస్‌ సబ్సిడీ కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల నిత్యావసరమైన విద్యుత్‌ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ వినియోగదారులు, రైతులు, కార్మికులు బషీర్‌బాగ్‌ విద్యుత్‌ అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ మురహరి రఘు, సత్యవతి, విక్రమ్‌, లీల, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -