– ఇద్దరి అరెస్ట్.. నగదు, ప్రెస్ ఐడీ కార్డు, బైక్ స్వాధీనం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మీడియా ప్రతినిధులమంటూ రైతును బెదిరించి రూ.5 వేల నగదు బలవంతంగా తీసుకున్న ఘటనలో ఇద్దరిని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐ నాగరాజు, ఎస్ఐ యయాతి రాజు లు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన పండు కిరణ్ (29), సయ్యద్ జానీ అహ్మద్ (39) ఈ ఘటనకు పాల్పడ్డారు.
ఈ నెల 23/24న తెల్లవారుజామున రామచంద్రాపురం ఎక్స్ రోడ్డు సమీపంలో పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను నిందితులు అడ్డుకున్నారు. తాము మీడియా ప్రతినిధులమని చెప్పి డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ డయల్ -112 కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అతని సెల్‌ఫోన్ ను లాక్కునేందుకు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగినట్లు పేర్కొన్నారు.
అనంతరం డ్రైవర్‌ను చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 వేల నగదును బలవంతంగా తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,000 నగదు, ‘టీ మీడియా’ ఐడీ కార్డు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ స్టార్ సిటీ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఐడీ కార్డుల దుర్వినియోగంపై కఠిన చర్యలు: మీడియా గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వారావుపేట పోలీసులు హెచ్చరించారు.



