డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా
ఎగసిన ప్రజాఉద్యమం
ఉద్రిక్తంగా మారిన చలో కలెక్టరేట్
ఎక్కడికక్కడా పోలీసుల అడ్డగింత, నాయకుల ముందస్తు అరెస్టులు
నవతెలంగాణ-కొత్తూరు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం అవుతోంది. ‘డంపింగ్ యార్డ్ హటావో.. దర్గా బచావో..’ అంటూ జేఏసీ అధ్యక్షులు అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు యెల్లారం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన చలో కలెక్టరేట్ కు సిద్ధాపూర్ పరిసర ప్రాంత స్థానికులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో దర్గా కు చేరుకోవడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, దర్గా పరిసరాలు కలుషితమై, తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు 641 జీవోను వెంటనే రద్దు చేసి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ప్రజాగ్రహం
డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘ఎమ్మెల్యే రావాలి.. సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా వేలాదిమంది రోడ్డుపై పరుగులు పెట్టారు. పోలీసులు వారిని వారించేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడా అడ్డుకొని ముఖ్య నాయకులతో చర్చించారు.
నాయకుల ముందస్తు అరెస్టులు
డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా జేఏసీ చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముఖ్య నాయకులను తెల్లవారుజామునే ముందస్తు అరెస్టు చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు యెల్లారం శేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్, నాయకులు వీరమోని దేవేందర్ ముదిరాజ్, కర్రోళ్ల సురేందర్, నవీన్ చారి తదితరులను అరెస్టు చేసి, కొత్తూరు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. వీరిని వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాదయాత్రగా సుమారు ఆరు కిలోమీటర్ల మేర కొత్తూరు వరకూ నడిచి వెళ్లారు.
ముఖ్య నాయకులను కలెక్టర్ తో కల్పిస్తాం..
కాంగ్రెస్ చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు డీసీపీ శిరీష చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ముఖ్యమైన పదిమంది నాయకులను తీసుకెళ్లి కలెక్టర్ ను కల్పిస్తానని మీరంతా తమ తమ గ్రామాల్లోకి వెళ్లాలని డీసీపీ కోరారు. మీరు ఇలాగే ధర్నా చేస్తానంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
డంపింగ్ యార్డ్ హటావో..దర్గా బచావో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



