అంతర్గత విభేదాలపై నితిన్ చర్చలు ఫలించేనా?
ఆగమేఘాల మీద ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గ్రూపులుగా విడిపోయిన వారు బహిరంగ విమర్శలకూ దిగుతున్నారు. ‘నా ఇలాకకు రావద్దంటే నా ఇలాకకు రావొద్దంటూ’ ఆ పార్టీ ఎంపీలు ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఆ పంచాయితీ ప్రధాని మోడీ దగ్గరకు పోయింది. అయినా సీనియర్ నేతల్లో ఎలాంటి మార్పు రాకపోగా, తమ మాటలతో మళ్లీ బజారుకెక్కారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తెలంగాణ బీజేపీపై ఫోకస్ పెట్టారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో దశలవారీగా చర్చలు జరుపుతున్నారు. కానీ అవి ఫలితాన్ని ఇవ్వటం లేదు. మనుసులను కలుపుతున్నారు..కానీ వారి మనసులను మాత్రం కలపలేకపోతున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ.. అటు బయటా కొనసాగుతుండటం గమనార్హం. కొన్నేండ్లుగా పార్టీ నేతల్లో ముదిరి పాకానపడిన ఈ విభేదాలను తగ్గించడం అంత ఈజీ కాదనే అభిప్రాయాన్ని కమలం పార్టీ నేతలే స్వయంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజులపర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన నితిన్ నబిన్… నాయకులతో సుదర్ఘీ మంతనాలు జరిపారు. వారికి ఎంతగానో నచ్చజెప్పారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అంతకంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కలిసికట్టుగా పని చేయాలంటూ ఆదేశించారు. హైదరాబాద్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సమక్షంలో ఎంపీలు ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి పని చేసే విధంగా ఒప్పందం కుదిర్చారు. ఇద్దరమూ కలిసే పని చేస్తామంటూ వారు హామీనిచ్చారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. తాజాగా శుక్రవారం ఢిల్లీలో బండి సంజయ్ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఈటల రాజేందర్ తోపాటు రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఇదే సమయంలో బీజేపీ అధిష్టానం కూడా కీలక భేటీ నిర్వహించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత తదితరాంశాలపై చర్చించారు. అందులో భాగంగా రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్‌రావు, బీజేపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఆగమేఘాల మీద ఢిల్లీకి పిలిపించుకుని చర్చించారు. ‘రాష్ట్ర పార్టీ నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. ఎవరి గోల వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు… ఇది సరికాదు…’ అంటూ ఆయన క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. ఎంతో సర్దిజెప్పినా, సమన్వయం చేసినా…ఇంకా విభేదాలతో కొట్టుకోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గతంలో కూడా రాష్ట్ర పార్టీ నేతల మధ్య ఐక్యత కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహ పలువురు పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నించారు. అయినా నాయకుల మాటల్లోగానీ, చేతల్లోగానీ ఎలాంటి మార్పు రాకపోవటంతో నబిన్ సీరియస్ అయినట్టు తెలిసింది.
ఎలాంటి విభేదాలు లేవు బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు
కాగా తమ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుంటామని తెలిపారు. బీజేపీలో ‘పాత-కొత్త’ అనే భేదం లేదన్నారు. పార్టీలో చేరిన మరుసటి క్షణం నుంచే ప్రతి ఒక్కరూ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేస్తారని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సమావేశానంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. జనసేన వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో దాంతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.
మనుషులు కలిశారు…మనసులు కలిసేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



