భైరాన్‌పల్లిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలి : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
వాడవాడలా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలు
రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పలుచోట్ల బైక్‌ర్యాలీలు
ఆ స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని నేతల పిలుపు
చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు సహించరు : తమ్మినేని
కులమతాలకతీతంగా సాయుధ పోరాటం : ఎస్ వీరయ్య
నవతెలంగాణ- విలేకరులు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ఆనాటి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వాడవాడలా సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఎర్ర చొక్కాలు ధరించి నినాదాలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని జనానికి వివరిస్తూ ఎర్రదండు కదిలింది. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం భైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డితో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. బురుజు వద్ద సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం లేని వ్యక్తులు నేడు సంస్మరణ దినోత్సవాలను నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో 2500 మందిని నిజాం రజాకార్లు కాల్చి చంపారని, ఒక్క భైరాన్‌పల్లి చుట్టుపక్క గ్రామాల్లోనే కలిపి 136 మందిని కాల్చి చంపారని గుర్తుచేశారు.
దేశ స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ ఎంత గొప్పవాడో.. భైరాన్‌పల్లి అమరులు కూడా అంత గొప్పవారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. చార్మినార్, గోల్కొండ లాంటి కట్టడాలను అలంకరిస్తున్నారు కానీ.. ఒకే రోజు 136 మంది ప్రాణాలర్పించిన బైరాన్‌పల్లి బురుజును ఎందుకు అలంకరించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో బోరుబావుల మీద ఆధారపడే వ్యవసాయం చేస్తుంటారన్నారు. అయితే రానున్న కాలంలో కొత్త విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టి వ్యవసాయ రంగానికి కూడా కరెంటు చార్జీలు విపరీతంగా వేసే విధంగా చట్టం రూపొందించారన్నారు. భైరాన్‌పల్లి స్మృతి వనం ఏర్పాటుకు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందుకు సీపీఐ(ఎం) ముందు వరసలో ఉంటుందన్నారు. బైరాన్‌పల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు.
చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు సహించరు : తమ్మినేని
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు చూస్తే ప్రజలు సహించబోరని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్కు మీదుగా కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌లో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేవలం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మాత్రమే కాదని, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో సామాన్య ప్రజలు సాగించిన మహత్తర ప్రజా పోరాటమని స్పష్టంచేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో పాలకుడు ముస్లిం కావడం వాస్తవమే అయినప్పటికీ, ప్రజలను దోపిడీ చేసిన భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు వివిధ మతాలకు చెందినవారున్నారని తెలిపారు. నిజాం వ్యతిరేక పోరాటంలో హిందువులు, ముస్లింలు కలిసి పాల్గొన్నారని, బందగీ, మఖ్దూం మొహియుద్దీన్, షోయబుల్లాఖాన్ వంటి ముస్లిం ప్రజా నాయకులు కూడా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సెప్టెంబర్ 17న ప్రారంభం కాలేదని, ఆ రోజుతో ముగియలేదని అన్నారు. నిజాం లొంగిపోయిన అనంతరం కూడా తెలంగాణలో కమ్యూనిస్టులు, ప్రజా ఉద్యమాలపై సైనిక అణచివేత కొనసాగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టుల పాత్రను చరిత్ర నుంచి చెరిపేయడం సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రజలకు ఐక్యతను నేర్పిందని, కులమతాలకు అతీతంగా శ్రమజీవులు ఐక్యంగా పోరాడితేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి, పెరుగుతున్న అసమానతలు, దోపిడీ, మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
కుల మతాలకతీతంగా సాయుధ పోరాటం : ఎస్. వీరయ్య
కుల మతాలకతీతంగా సాగిన తెలంగాణ సాయిధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఎర్రజెండా రాజ్య స్థాపన కోసం పోరాడాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఆర్ఎన్ గార్డెన్‌లో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారామ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైనప్పటికీ ఇప్పటికీ దొరల పాలన, నియంతృత్వం, వెట్టి చాకిరీ కొనసాగుతుందని అన్నారు. కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు. ఉపాధి లేదన్నారు. వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట సమీపంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ.. వీర తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు, వెలిదండ గ్రామాల్లో జరిగిన సభల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రైతాంగ పోరాట స్ఫూర్తిని వివరించారు. ఆ స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ ఆధ్వర్యంలో నాటి పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ కొల్లూరు పోచయ్య సతీమణి కొల్లూరి చంద్రమ్మను సన్మానించారు. బొల్లెపల్లి గ్రామంలో మాజీ ఎంపీ, పోరాట యోధులు రావి నారాయణరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల పరిధిలోని సీపీఐ(ఎం) రాజీవ్ గృహకల్ప శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడారు. నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా కొడంగల్, మహబూబ్‌నగర్‌ల్లో సభలు నిర్వహించారు. గద్వాల, వనపర్తి, నిజామాబాద్ ల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. సభలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ప్రాంతాల్లో సభలు నిర్వహించారు.


