ఎర్రవెల్లిలో అధికారులను అడ్డుకున్న దళిత రైతులు.. వాగ్వాదం
మాకు సమాచారం ఇవ్వకుండా భూములు ఎలా కొలుస్తారు? అంటూ నిలదీత
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్వే చేస్తున్నాం : రెవెన్యూ అధికారులు
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను వదులుకోం: రైతులు
నవతెలంగాణ-మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్ భూములపై గురువారం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టడంతో రైతులు వారిని అడ్డుకున్నారు. దాంతో అక్కడ వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల వ్యవహారంపై బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించింది. 325 సర్వే నంబర్‌లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉందన్న అంశాన్ని అసెంబ్లీలో సీఎం ప్రస్తావించారు. ఈ భూముల వాస్తవ పరిస్థితి, హద్దులు, రికార్డులు, ఎవరి ఆధీనంలో ఉన్నాయన్న అంశాలను పరిశీలించేందుకు విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కుక్ తహసీల్దార్ సరిత ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఎర్రవల్లి చేరుకుని 325 సర్వే నంబర్ భూములను పరిశీలించారు. సర్వే ప్రక్రియను ప్రారంభించే సమయంలో గ్రామానికి చెందిన పలువురు దళిత రైతులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే నిర్వహించడంపై వారు అధికారులను ప్రశ్నించారు. దాంతో కొద్దిసేపు రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమాచారం లేకుండా ఎలా సర్వే చేస్తారు? : దళిత రైతులు
‘తరతరాలుగా మేమే ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా అధికారులు వచ్చి భూములను ఎలా కొలుస్తారు?’ అంటూ రైతులు అధికారులను నిలదీశారు. తమ భూములకు సంబంధించిన రికార్డులు, హక్కుల అంశాలను పరిశీలించాల్సి ఉంటే తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని కోరారు. అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టామని, భూముల వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం కోసమే సర్వే చేస్తున్నామని రైతులకు వివరించినట్టు తెలిసింది. సర్వే ద్వారా వెంటనే ఎవరి భూమిని స్వాధీనం చేసుకునే నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.
‘ఆ భూములతో మా జీవనం ముడిపడి ఉంది : దళిత రైతులు, ఎర్రవెల్లి
దళిత రైతులు శ్రీనివాస్, కరుణాకర్ తదితరులు మాట్లాడుతూ.. 325 సర్వే నంబర్‌లోని భూముల్లో సుమారు 150 దళిత కుటుంబాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్.. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయం లో సాగుకు అనుకూలంగా లేని భూములను చదును చేయించడం, రాళ్లు, గుట్టలను తొలగించడం వంటి పనులు జరిగా యని చెప్పారు. సాగు లో ఉన్న రైతులకు డ్రిప్ పరికరాలు అందించ డంతో పాటు పాండు రంగ సాగర్ పేరుతో చెరువు నిర్మించి సాగు నీటి సౌకర్యం కల్పించా రని తెలిపారు. దాంతో కొన్నేండ్లుగా రెండు పంటలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే ఇవన్నీ రైతులు చేసిన వాదనలు మాత్రమే కాగా, భూముల హక్కులు, కేటాయింపు, రికార్డుల్లోని వివరాలపై అధికారిక రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి సర్వే అనంతరం స్పష్టత రావాల్సి ఉంది.
‘మా భూమికి ఫామ్‌హౌస్‌కు సంబంధం లేదు’
తమ భూములకు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి ఎలాంటి సంబంధం లేదని రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోని కొంతమంది రైతులు తమ పట్టా భూములను స్వచ్ఛందంగా విక్రయించగా, వాటిని మార్కెట్ ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. దళిత కుటుంబాలతో పాటు గ్రామంలోని పేదలకు గతంలో వివిధ రకాలుగా సహాయం అందిందని చెప్పారు. తమ భూములను మొత్తం రీసర్వే చేసి, వాస్తవంగా సాగులో ఉన్న రైతుల వివరాలను నమోదు చేసి, అర్హత ఉన్న వారికి హక్కులు కల్పించే ప్రక్రియ చేపట్టాలని గతంలో ప్రయత్నాలు జరిగాయని, ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. ఈ అంశంపై అధికారిక రికార్డులు, పాత సర్వే వివరాలు, భూ హక్కుల పత్రాలను పరిశీలించాల్సి ఉంది.
రికార్డుల ఆధారంగానే తేలనున్న హక్కులు
ప్రస్తుతం 325 సర్వే నంబర్ భూములపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించడంతో భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సాగుదారుల వివరాలు, అసైన్డ్ భూముల రికార్డులు తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సర్వే అనంతరం క్షేత్రస్థాయి వివరాలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులో ఉంచారు. అయితే 325 సర్వే నంబర్ భూములపై కొనసాగుతున్న విచారణ, రైతుల అభ్యంతరాలు, ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో ఎర్రవల్లిలో భూముల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
388 ఎకరాలపై అసెంబ్లీలో ప్రస్తావన
325 సర్వే నంబర్‌లో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిధిలో మొత్తం భూముల వివరాలు, వాటిలో ప్రభుత్వ భూమి ఎంత, ప్రయివేటు భూమి ఎంత, ఎవరి ఆధీనంలో ఉందన్న అంశాలను నిర్ధారించేందుకు విచారణ చేపట్టాలని సీఎం రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూమి ఉన్నట్టు విచారణలో తేలితే అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళిత కుటుంబాలకు కేటాయిస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, హక్కులు తదితర అంశాలపై తుది స్పష్టత అధికారిక సర్వే, రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం రావాల్సి ఉంది.



