క్యూ1లో రూ.21,121 కోట్లు
ఎన్‌ఐఐ 15 శాతం వృద్ధి
తగ్గిన మొండి బాకీలు
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ1)లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) పెరుగుదలతో బ్యాంకు నికర లాభం వార్షిక ప్రాతిపదికన 10.23 శాతం పెరిగి రూ.21,121 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.19,160 కోట్లుగా నమోదయ్యింది. క్రితం క్యూ1లో నిర్వహణ లాభం 9.77 శాతం పెరిగి రూ.33,529 కోట్లకు చేరడం బ్యాంక్ ప్రగతికి ప్రధాన మద్దతును అందించింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ఏకంగా 14.88 శాతం పెరిగి రూ.46,992 కోట్లకు చేరింది. మొత్తం వడ్డీ ఆదాయం రూ.1,27,896 కోట్లుగా నమోదవగా, వడ్డీ వ్యయాలు రూ.80,904 కోట్లుగా ఉన్నాయి. అయితే ట్రెజరీ, విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) ఆదాయాలు తగ్గడంతో నాన్-ఇంట్రెస్ట్ ఆదాయం 9.07 శాతం క్షీణించి రూ.15,923 కోట్లకు చేరింది. ఫారెక్స్, డెరివేటివ్స్ ఆదాయం 69.57 శాతం తగ్గగా, పెట్టుబడుల విక్రయాల లాభం కూడా రూ.6,326 కోట్ల నుంచి రూ.4,319 కోట్లకు తగ్గింది. మరోవైపు రుణాల ప్రాసెసింగ్ ఫీజులు, ప్రభుత్వ వ్యాపార కమిషన్లు పెరగడంతో ఫీజు ఆధారిత ఆదాయం 20.83 శాతం పెరిగి రూ.9,476 కోట్లకు చేరింది.
మొండి బాకీలను కట్టడి చేయడంలో ఎస్‌బిఐ మరింత మెరుగ్గా వ్యవహారించింది. జూన్ 2026 చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తుల (జిఎన్‌పిఎ) నిష్పత్తి 1.83 శాతం నుంచి 1.47 శాతానికి పరిమితం కాగా.. నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌ఎన్‌పిఎ) నిష్పత్తి 0.47 శాతం నుంచి 0.38 శాతానికి పడిపోయింది. రుణాల వ్యయం 0.47 శాతం నుంచి 0.27 శాతానికి తగ్గడం, స్లిప్పేజ్ నిష్పత్తి 0.75 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గడం కూడా ఆస్తుల నాణ్యత మెరుగుదలను ప్రతిబింబించాయి.
డిజిటల్‌పై ప్రధాన ఫోకస్ : సిఎస్ శెట్టి
‘డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్’ అనే వ్యూహంతో బ్యాంక్ ముందుకు సాగుతోంది. వినియోగదారుల సేవలను మరింత వేగవంతం చేయడానికి సరళ్ ప్రక్రియను విస్తరించడంతో పాటు, వ్యాపార ఖాతాదారులకు 24 గంటల సహాయం అందించేందుకు ‘యోనో జీ’ అనే ఏజెంటిక్ ఎఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌ను ప్రారంభించాము. అలాగే రూ.10 కోట్ల వరకు ఎస్‌ఎంఇ రుణాల ఆమోదాన్ని వేగవంతం చేసే ఎంఎస్‌ఎంఇ డ్రీమ్’ వ్యవస్థను విస్తరించాము. రుణ ఖాతాల్లో ఒత్తిడి సంకేతాలను ముందుగానే గుర్తించేందుకు ప్రిజమ్ అనే ప్రిడిక్టివ్ స్ట్రెస్ మానిటరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను బలోపేతం చేశాము. ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ విజయవంతమైన లిస్టింగ్ ఎస్‌బిఐ గ్రూప్‌కు కీలక మైలురాయిగా నిలిచింది. 2030లో 75వ వార్షికోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎస్‌బిఐని మరింత బలోపేతం చేసే దిశగా కృషి కొనసాగుతోంది.’ అని ఎస్‌బిఐ ఛైర్మన్ సిఎస్ శెట్టి తెలిపారు.
రుణాలు@ రూ.50.47 లక్షల కోట్లు
వ్యాపార పరంగా బ్యాంకు స్థూల రుణాలు 18.63 శాతం పెరిగి రూ.50.47 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇ (ఆర్‌ఎఎం) రుణాలు 18.20 శాతం, కార్పొరేట్ రుణాలు 18.05 శాతం చొప్పున వృద్ధి చెందాయి. మొత్తం డిపాజిట్లు 9.73 శాతం పెరిగి రూ.60.06 లక్షల కోట్లకు చేరగా, కాసా డిపాజిట్లు 9.30 శాతం పెరిగి రూ.22.61 లక్షల కోట్లకు పెరిగాయి.
ఎస్‌బీఐకి బంపర్ లాభాలు
- Advertisement -
- Advertisement -



