Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజైల్‌ భరోను జయప్రదం చేద్దాం

జైల్‌ భరోను జయప్రదం చేద్దాం

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
‌కోరంటి చౌరస్తాలో కరపత్రాల పంపిణీ
నవతెలంగాణ–అంబర్‌పేట

​క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ అంబర్‌పేట జోన్‌ పరిధిలోని కోరంటి చౌరస్తా వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయా ఉదారవాద సంస్కరణలను దూకుడుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌ల ద్వారా కార్మిక హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేలా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ పేరుతో పని గంటలను పెంచుకునేందుకు యాజమాన్యాలకు వెసులుబాటు కల్పిస్తోందన్నారు. సమ్మె హక్కును, కార్మిక సంఘాల గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ను కష్టతరం చేస్తూ ఉద్యోగ భద్రతకు ముప్పు తెస్తోందని విమర్శించారు. 300 మంది లోపు కార్మికులు పనిచేసే సంస్థల్లో ముందస్తు నోటీసు లేకుండా ఉద్యోగుల తొలగింపునకు అవకాశం కల్పించే ‘హైర్‌ అండ్‌ ఫైర్‌’ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వేతనాల కోడ్‌, సామాజిక భద్రతా కోడ్‌, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనలతో భవన నిర్మాణ, హమాలీ, రవాణా, బీడీ తదితర అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. లేబర్‌ కోడ్‌లు అమలైతే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

వామపక్షాల పోరాటాల ఫలితంగా 2005లో ఏర్పడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి హామీని కొనసాగిస్తూ.. కేంద్రం నిధుల వాటాను తగ్గించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పేదలకు అందుతున్న ఆహార భద్రతను దెబ్బతీసే చర్యలు చేపట్టకుండా, ప్రజలకు అవసరమైన స్థాయిలో రేషన్‌ బియ్యం అందించాలని కోరారు. విద్యుత్‌ రంగంలో కేంద్రం సంస్కరణల వల్ల రాష్ట్రాల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్‌ మీటర్లు, ముందస్తు చెల్లింపుల విధానాల ద్వారా పేదలు, రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను భవిష్యత్‌లో నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్‌భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఎం. దశరథ్‌, నగర కోశాధికారి అజయ్‌బాబు, నగర ఉపాధ్యక్షుడు జి. రాములు, సీఐటీయూ జోన్‌ నాయకులు బి. లక్ష్మణ్‌, పి. శ్రీనివాస్‌, మున్సిపల్‌ కార్మికులు లక్ష్మమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -