భూములకు ఫెన్సింగ్‌ను అడ్డుకున్న రైతులు..పోలీసుల రాకతో యుద్ధ వాతావరణం
తోపులాటలో సొమ్మసిల్లిన రైతు
ఉద్రిక్తతల మధ్య భూములకు హైడ్రా ఫెన్సింగ్
భూమికి బదులు భూమే ఇవ్వాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ-శంషాబాద్
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూమి స్వాధీనం చేసుకోవద్దని, పొజిషన్‌లో ఉన్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని బహదూర్‌గూడ రైతులు చేపట్టిన దీక్షా శిబిరం శనివారం ఒక్కసారిగా అట్టుడికింది. పది రోజులుగా శాంతియుతంగా దీక్షలు సాగగా.. శనివారం రెవెన్యూ, హైడ్రా అధికారుల రాకతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు రైతులు భూములకు ఫెన్సింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. మరోవైపు పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రైతులు ఒక్కసారిగా ఆవేశానికి గురై కారం పొడిని పోలీసుల కండ్లలో చల్లారు. డీసీపీ, సీఐ, కాని స్టేబుల్ కండ్లలో కారం పడటంతో
వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారం చల్లిన రైతులను అదుపులోకి తీసుకున్నారు. రైతుల ఆందోళనల మధ్యనే హైడ్రా అధికారులు భూములకు ఫెన్సింగ్ వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ గ్రామ రెవెన్యూలో 650 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. ప్రాజెక్టుల కోసం భూమిని స్వాధీనం చేసుకోవద్దని, పొజిషన్ లో ఉన్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు ధర్నా వద్ద సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో అధికారులు శనివారం తెల్లవారుజామున రెండు, మూడు గంటల సమయంలో భూస్వాధీన చర్యలు ప్రారంభించారు. ఎలాంటి ఘర్షణలూ జరగకుండా వందలాది మంది పోలీసులను మోహరించి, గ్రామానికి ఉన్న అన్ని రహదారులనూ అష్ట దిగ్బంధనం చేశారు. భారీ కేడ్ లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరినీ అనుమతించకుండా 650 ఎకరాలకు అన్ని వైపులా ఫెన్సింగ్ పనులు చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద అడ్డుకోబోయిన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కుమ్మరి నర్సింహను అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతన్ని శంషాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బహదూర్ గూడ , ఔటర్ రింగ్ రోడ్, లక్ష్మీగూడ, తుక్కుగూడ, సయ్యద్ గూడ రోడ్లను పోలీసులు బంద్ చేశారు. జేసీబీలతో ముళ్లపొదలను తొలగిస్తూ ఇనుప పైపులను పాతుతూ.. ఇనుప జాలి ఫెన్సింగ్ వేశారు. అక్కడక్కడా అడ్డుగా వచ్చిన షెడ్లను, ఇండ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. కేఎల్ఆర్ ఫామ్ హౌస్ వెళ్లే దారి, లక్ష్మిగూడ దగ్గర ఉన్న విల్లాలకు తప్ప చుట్టూ అంతా ఫెన్సింగ్ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రభుత్వ భూములనే స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్ రెడ్డి రైతు శిబిరానికి వస్తుండగా.. పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. అలాగే, రైతులకు మద్దతుగా బీజేపీ రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, రాష్ట్ర నాయకులు వడ్డే చంద్రయ్య, మండల అధ్యక్షులు చిటికెల వెంకటయ్య, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సేవెళ్ల మహేందర్ దీక్షా శిబిరం వద్ద కూర్చున్నారు.
బలవంతంగా గుంజుకోవడం అన్యాయం : రైతులు
తమకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా.. పోలీసులను పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ.. దౌర్జన్యంగా భూములు గుంజుకోవడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణం పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపైనా, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు భూమికి బదులు భూమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత
రైతుల దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులకు, రైతులకు మధ్య ఓ యుద్ధ వాతావరణం నెలకొంది. మహిళా రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దాంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కండ్లలో కారం చల్లడంతో డీసీపీ, సీఐ, కానిస్టేబుల్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కండ్లలో కారం చల్లిన మహిళా రైతులను గుర్తించి, వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
బుల్లెట్ ట్రైన్‌కు భూములివ్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



