యూనిట్ అధికారులు నెలకు రెండు సార్లు క్షేత్ర పర్యటన చేయాలి
డ్రగ్స్, మహిళలు, బాలల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి:వీడియో కాన్ఫ రెన్స్ లో డీజీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడంతో పాటు ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ సీవీ. ఆనంద్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, సమర్థవంతమైన పోలీసింగ్ ప్రమాణాల అవలంబన అనే అంశంపై ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ ప్రస్తుత పనితీరులో మార్పు రావాలని ప్రభుత్వం ఆశిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, పైఅధికారుల పట్ల గౌరవం లేకపోవడం, అవినీతి వంటి ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. పోలీసు సేవలందింపులో గణనీయమైన మార్పు తీసుకురావా లన్నారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కఠిన క్రమశిక్షణ పాటించాలన్నారు. గడిచిన మూడు దశాబ్దాలుగా రాష్ట్ర పోలీస్ యం త్రాంగం ప్రధానంగా మావోయిజం, నక్సలిజం అణచివేతపైనే దృష్టి సారించిందని డీజీపీ గుర్తుచేశారు.
గత 15 ఏండ్లుగా నక్సల్స్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయినందున.. ప్రస్తుత పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి ప్రత్యేక విభాగాల ప్రాధాన్యతను పునఃసమీక్షించి, వాటిని పునర్వ్యవస్థీకరించే సమయం వచ్చిందన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుపదార్థాల (నార్కోటిక్స్) నిర్మూలనకు అధికారులు గట్టిగా కృషి చేయాలని, ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీవ్రతరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతా ప్రమాణాలను క్రమబద్ధీకరించడానికి త్వరలోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజారోగ్య రక్షణ కోసం ఆహార కల్తీ నిరోధక విభాగాన్ని (ఫుడ్ అడల్టరేషన్ వింగ్), ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రత, బాలల అక్రమ రవాణా నిరోధానికి పెద్దపీట వేయాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని డీజీపీ స్పష్టం చేశారు. భరోసా కేంద్రాలు, షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లలో సీసీటీఎన్ఎస్ సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాల అమలు సరిగా లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.



