బెట్టింగ్‌లపై ఫిర్యాదులే ఎక్కువ
ఎఎస్‌సిఐ నివేదికలో వెల్లడి
హైదరాబాద్ : డిజిటల్ మాధ్యమాల్లో ఉల్లంఘనలు భారీగా జరుగుతున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) తెలిపింది. ముఖ్యంగా విదేశీ బెట్టింగ్, రియల్టీ, పర్సనల్ కేర్, ఆహారం, పానీయాలు, డ్రగ్స్‌నకు సంబంధించిన ఉత్పత్తులు ఎక్కవుగా ఉన్నాయని ఎఎస్‌సిఐ 2025-26 వార్షిక ఫిర్యాదుల నివేదికలో వెల్లడించింది. గడిచిన 2025-26లో మొత్తం 11,581 కేసులను సమీక్షించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 21 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఈ కేసులు 9,841 ప్రకటనలకు సంబంధించినవి. మొత్తం కేసులలో 93 శాతం ఎఎస్‌సిఐ పర్యవేక్షణ ద్వారానే గుర్తించబడటం విశేషం. ఉల్లంఘనలకు పాల్పడిన ప్రకటనలలో 75.4 శాతం హానికరమైన ఉత్పత్తులు లేదా పరిస్థితులను ప్రోత్సహించగా, 27.5 శాతం ప్రకటనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 86 శాతం మంది ప్రకటనదారులు స్వచ్ఛందంగా నిబంధనలను పాటించారు. నియంత్రణ చర్యలు కొనసాగుతున్నప్పటికీ బెట్టింగ్ రంగం అత్యధిక నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ విభాగంలో మొత్తం 6,933 కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత స్థానాల్లో రియల్టీ రంగం 643 కేసులతో, పర్సనల్ కేర్ 576 కేసులతో, ఆహార, పానీయాల విభాగం 331 కేసులతో, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘించే ప్రోడక్టులు 274 కేసులతో ఉన్నాయి. ఈ నివేదికలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఒక ప్రధాన ఆందోళనకర అంశంగా ఉందని ఎఎస్‌సిఐ తెలిపింది. పరిశీలించిన ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రకటనల్లో 97.3 శాతం వాటికి సవరణలు అవసరమవ్వగా.. అందులో 54 శాతం పైగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ రంగానికి చెందినవే ఉన్నాయి. ఈ ప్రకటనలలో 75.4 శాతం హానికరమైన ఉత్పత్తులను లేదా పరిస్థితులను ప్రోత్సహించగా, 27.5 శాతం ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా పర్సనల్ కేర్ విభాగంలో చర్మం రంగు మారడం, జుట్టు పెరగడం వంటి అసాధ్యమైన కాలపరిమితి వాదనలు, అలాగే ఆహార పానీయాల విభాగంలో బరువు తగ్గించే సప్లిమెంట్లు, న్యూట్రాస్యూటికల్స్ వంటి ఉత్పత్తులపై ఆధారాలు లేని వైద్య, చికిత్సాపరమైన నకిలీ శాస్త్రీయ ప్రకటనలు ఎక్కువగా నమోదయ్యాయి. డిజిటల్ ప్రకటనలలో మరింత జవాబుదారీతనం అవసరమని ఎఎస్‌సిఐ ఛైర్మన్ సుధాన్షు వాట్స్ తెలిపారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టి-రెరా)వంటి సంస్థలతో కుదుర్చుకున్న భాగస్వామ్యాలు తప్పుడు ప్రకటనలను అరికట్టడంలో, వినియోగదారుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎఎస్‌సిఐ సిఇఒ మనీషా కపూర్ వెల్లడించారు.



