Monday, June 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపసుపు సాగు షురూ..

పసుపు సాగు షురూ..

- Advertisement -

పత్తా లేని పసుపు బోర్డు
పెరుగుతున్న పెట్టుబడి.. తగ్గుతున్న రాబడి

ఏటికేడు తగ్గుతున్న సాగు విస్తీర్ణం
సాగు మెళకువలు నేర్పి ధర నిర్ణయించాలంటున్న రైతులు
క్షేత్రస్థాయికి 
చేరని అవగాహన కార్యక్రమాలు

నవతెలంగాణ-
నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్‌ జిల్లా పసుపు రైతులు పట్టుబట్టి పసుపు బోర్డును సాధించుకున్నారు. పసుపు బోర్డు వచ్చాక.. సాగులో మెళకువలు నేర్పుతారని ఆశపడ్డారు. నేల రకాన్ని బట్టి నాణ్యమైన పసుపు విత్తనం అందజేస్తారని ఆశించారు. పెట్టుబడికి తగ్గట్టు మద్ధతు ధర వచ్చేలా కృషి చేస్తారని భావించారు. పసుపు బోర్డు ప్రారంభమై ఏడాదిన్నర పూర్తయినా కనీసం ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పసుపు పంట పొలాలను అధికారులు, సిబ్బంది పరిశీలించి సూచనలు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పసుపు పంట సాగుకు సన్నద్ధమవుతున్నా.. ఇప్పటికీ పసుపు బోర్డు కార్యాకలాపాలు క్షేత్రస్థాయిలో పత్తాలేవు. బోర్డు విధులు, బాధ్యతలు ఏమిటో తెలియడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పసుపు బోర్డు వచ్చినట్టు సైతం కొందరి రైతులకు తెలియకపోవడం కొసమెరుపు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన జాతీయ పసుపు బోర్డుపై నవతెలంగాణ ప్రత్యేక కథనం. నిజామాబాద్‌ జిల్లా రైతులు చైతన్యవంతులన్న పేరు. పసుపు బోర్డు కోసం చేపట్టిన ఉద్యమంలో ఎన్నికల ఫలితాలను సైతం తారుమారు చేయగలిగారు. వారి ఆందోళనను అనుకూలంగా మార్చుకుని అరవింద్‌ ‌గెలిచారు. అయినా చాలా ఏండ్ల తర్వాత బోర్డు ఏర్పాటు కాలేదు. చివరికి ఎట్టకేలకు పసుపు బోర్డు మంజూరు అయిన విషయం విదితమే.

2025 జనవరి 14వ తేదీన సంక్రాంతి రోజు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. తదనంతరం 2025 జూన్‌ 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు సిబ్బందిని కేటాయించలేదు. సైసెస్‌ బోర్డులో ఉన్న సిబ్బందితోనే పసుపు బోర్డు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్ల నిధులు విడుదలవ్వడంతో బాయిలర్స్‌, పాలిష్‌ యంత్రాలు పలువురి రైతులకు, ఎఫ్‌పీవోలకు అందజేశారు.పెరుగుతున్న పెట్టుబడి.. తగ్గుతున్న దిగుబడి ప్రస్తుతం పసుపు సాగుకు రైతులు సన్నద్ధం అయ్యారు. ఇది వరకే పొలాల్లో నల్లమట్టి, పశువుల ఎరువులు వేయించి సిద్ధం చేసి పెట్టారు. వర్షాలు పడటమే తరువాయి.. పసుపు విత్తనం నాటనున్నారు. కాగా పసుపు పంటకు పెట్టుబడి ఏటికేడూ క్రమంగా పెరుగుతుంది. దీనికి తోడు పంటకు లద్దిపురుగు, చిన్న పురుగు కాండంను తొలుస్తుండటంతో పసుపు కొమ్ములు పుట్టక దిగుబడి సైతం తగ్గుతుంది. పసుపు పంటను పండిస్తే ధర రాకపోవడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ఇంటిల్లిపాది కష్టపడుతున్నా నెలకు ఒక 20 వేల రూపాయల వేతనం కూడా పడని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. దీంతో పంట సాగును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి. గతంలో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 30 నుంచి 35 వేల ఎకరాల వరకు సాగవ్వగా గత సీజన్‌లో మాత్రం 22 వేల ఎకరాలకు పరిమితమైంది.

పసుపు బోర్డు మీదే ఆశలు …
పసుపు బోర్డుతో ఏర్పాటుతో సాగు మెళకువలతో పాటు దిగుబడి పెరిగేలా కృషి చేసి మద్దతు ధర నిర్ణయిస్తారఁ రైతులు భావిస్తున్నారు. కానీ ఆ మేర తీసుకున్న చర్యలు లేవు. నిధుల కోసం బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపగా.. ఎంత మేర విడుదల చేయనున్నారో దాన్ని బట్టి పసుపు బోర్డు పనితీరు తేలనుంది.

పసుపును ప్రమోట్‌ చేస్తున్నాం..
బోర్డు ప్రారంభించి ఏడాదిన్నర కావడంతో అన్ని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయాం. కానీ ప్రధానంగా రైతులను, వ్యాపారులను కలుస్తున్నాం.. పసుపులో ఔషద గుణాలను, వైద్య పరంగా వినియోగంపై విదేశాల్లో ప్రమోట్‌ చేస్తుండటంతో విదేశాలకు పసుపు ఎగుమతులు పెంచగలిగాం. డిమాండ్‌ పెరిగేలా చేయడంతో ప్రస్తుతం పసుపుకు స్థిరమైన ధర వస్తుంది. గతంలో పసుపు ఎగుమతులు దేశవ్యాప్తంగా రూ.1600 కోట్లు ఉంటే పసుపు బోర్డు ప్రారంభించిన ఏడాదిలోనే రూ.2100 కోట్లకఁ పెంచాం. రానున్న రోజుల్లో సిబ్బంది పెంచుకొని రైతులకు పంట ప్రారంభించిన మొదలు.. చేతికి వచ్చి మార్కెటింగ్‌ చేసే వరకు బాధ్యత తీసుకఁంటాం. బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపాం.. ఎంత మంజూరు చేస్తారో చూడాలి. కార్యాలయం ప్రారంభమై ఏడాది మాత్రమే అవుతుంది. రాబోవు రోజుల్లో రైతులకు మరింత చేరువ అవుతాం.
-పల్లె గంగారెడ్డి. జాతీయ పసుపు బోర్డు చైర్మెన్

ఎకరమే సాగు చేస్తున్నా…
ఎకరం పసుపు సాగు చేసేందుకు ప్రారంభంలో నల్లమట్టి వేసేందుకు రూ.30 వేలు, పశువుల ఎరువుకు రూ.40 వేల నుంచి 50 వేల వరకు వెచ్చించాలి. వీటితో పాటు ’20-20′ ఎరువు ధర బస్తాకు 1100 నుంచి రూ.2000 వేలకు పెరిగింది. కూలీలకు కూలీ పెరిగింది. కలుపుతీత పనులకు లెక్కేలేదు. పురుగుల మందులు, గుళికలు ఇలా ప్రతిదీ ఖర్చు తడిసి మోపెడవుతుంది. అన్ని చేస్తే తీరా ధర మాత్రం రాదు. దీంతో పసుపు పంట పండించాలంటేనే అప్పుల భయం పట్టుకుంటుంది. అందుకే రెండు ఎకరాల నుంచి ఒక ఎకరంలోనే పండిస్తున్నా. పసుపుబోర్డు అధికారులు ఎవరూ మాకు వచ్చి కలవలేరు.
పడాల చిన్నయ్య. చాకిర్యాల్‌. మెండోరా..

ఇంటిల్లిపాదికి నెలకు20 వేలు పడ్తలే…
పసుపు పంట సాగుకు ఇంటిల్లిపాది 10 నెలల పాటు పని చేస్తే నెలకు అందిరికి కలిపి కనీసం రూ.20 వేల వేతనం కూడా పడుతలేదు. అందుకే ఇక్కడి నుంచే ఎక్కువ మంది గల్ఫ్‌కు ఉపాధి కోసం పోతున్నారు. ఒకసారి కాకపోతే ఇంకోసారైనా ధర రాకపోదా అన్న ఆశతో ప్రస్తుతం పసుపు పంట పండిస్తున్నాం. పసుపు బోర్డు ప్రారంభించినా దాని ఫలితం మాత్రం ఇప్పటికీ దక్కడం లేదు.
బంటు లింగం. యువ రైతు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -