Monday, June 1, 2026
E-PAPER
Homeజాతీయంచిన్నారులకు అందని పౌష్టికాహారం

చిన్నారులకు అందని పౌష్టికాహారం

- Advertisement -

కేవలం 15.3 శాతం మందికే తగినంత ఆహారం: ఎన్ఎఫ్ హెచ్ ఎస్-6 రిపోర్టు
మోడీ ప్రభుత్వం మహిళలు, బాలికలు, చిన్నారుల కోసం కోట్లు ఖర్చుపెడుతున్నామని ప్రకటనలు చేస్తున్నది. వాస్తవానికి దేశంలోని చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందటంలేదన్న కఠోర వాస్తవాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ ఎస్-6) తాజాగా విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది.

న్యూఢిల్లీ : ప్రయివేటు ఎన్జీఓ సంస్థలు దేశంలో పౌష్టికాహార లోపం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తుంటే, వాటిని కేంద్రం కాదంటుంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం నిర్వహించిన గణాంకాల ప్రకారం, 6-23 నెలల వయస్సు గల పిల్లలలో తగినంత ఆహారం పొందుతున్న వారి నిష్పత్తి ఎన్ఎఫ్ హెచ్ ఎస్-5 లోని 11 శాతం ఉంటే, ఎన్ఎఫ్ హెచ్ ఎస్-6లో 15.3 శాతానికి పెరిగింది. ఆహార లభ్యత, ప్రభుత్వ పోషకాహార కార్యక్రమాల్లో మెరుగుదలలు ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెదడు అభివృద్ధికి అవసరమైన విభిన్నమైన, తరచుగా తీసుకునే భోజనాన్ని భారతీయ పసిపిల్లలు ఇప్పటికీ కోల్పోతున్నారని దీని అర్థం. పిల్లలు తగినంత కేలరీలు పొందుతున్నప్పటికీ, వారి ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారపదార్థాలు సరిపడా అందడం లేదని నిపుణులు హెచ్చరించారు. ఆరు నెలల్లోపు పిల్లలలో కేవలం తల్లిపాలు తాగే వారి సంఖ్య కూడా 63.7 శాతం నుంచి 55.8 శాతానికి తగ్గినట్టు ఈ గణాంకాలు చూపించాయి.
మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థలు సార్వత్రికంగా సిఫారసు చేస్తున్నాయి. శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పోషకాలు, యాంటీబాడీలు, ద్రవాలను తల్లిపాలు మ్రాతమే సరైన సమతుల్యతతో అందిస్తాయి. తద్వారా ఎదుగు తున్న జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థలను ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి కాపాడతాయి. పిల్లలకు పాలిచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిపై దేశవ్యాప్తంగా తక్షణ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బ్రెస్ట్‌ఫీ డింగ్ ప్రమోషన్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా (బీపీ ఎన్ఐ) వ్యవస్థాపకుడు డా. అరుణ్ గుప్తా అన్నారు.

“తల్లిపాలు పట్టడం అనేది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు. ఇది ప్రజారోగ్యం, పోషణ, బాలల హక్కులు, జాతీయ అభివృద్ధికి సంబంధిం చిన అంశం. తల్లులు విజయవంతంగా తల్లిపాలు పట్టడానికి వీలు కల్పించే వ్యవస్థలను పునర్నిర్మించ డానికి భారతదేశం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్ఎఫ్ హెచ్ ఎస్-6 ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి,” అని డాక్టర్ గుప్తా అన్నారు.
లోపిస్తున్న ఎదుగుదల ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపం (వయసుకు తగినంత ఎత్తు లేకపోవడం) 35.5 శాతం నుంచి 32.3 శాతానికి పడిపోయింది. తీవ్రమైన పోషకాహార లోపానికి సూచిక అయిన బక్కచిక్కిపోవడం (ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం) 19.3 శాతం నుంచి 16.3 శాతానికి తగ్గింది. తీవ్రమైన బక్కచిక్కిపోవడం 7.7 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గింది. వయసుకు తగినంత బరువు లేని పిల్లల నిష్పత్తి కూడా 32.1 శాతం నుంచి 29.2 శాతానికి తగ్గింది. ఈ ఫలితాలు భారతదేశంపై పోషకాహార లోపం “ద్వంద్వ భారాన్ని” కూడా ఎత్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, 6-24 నెలల వయస్సు పిల్లల పెరుగుదల, మెదడు అభివృద్ధికి కీలకమైన కాలం. ఆరు నెలల నుంచి.. కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోవు. పిల్లలు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు తాగుతూనే ఉంటారు. దీంతో సురక్షితమైన, పోషకమైన, విభిన్నమైన అనుబంధ ఆహారాలను తీసుకోవాలి. ధాన్యాలు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం లేదా చేపలు, పండ్లు, కూరగాయలు వంటి వివిధ రకాల ఆహార సమూహాలతో కూడిన ఆహారాన్ని డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేస్తోంది. అయితే తగినంత ఆహార వైవిధ్యం, వయస్సుకు తగిన పోషణ, ఎదుగుదల లోపం, బక్కచిక్కిపోవడం, సూక్ష్మ పోషకాల లోపాలు, ఇన్ఫెక్షన్లు, జ్ఞానాత్మక అభివృద్ధి లోపాలను నివారించడంలో సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, జీవితకాల శ్రేయస్సు కు తోడ్పడతాయి.

“తల్లిపాలు తక్కువగా ఇవ్వడం అనేది ఇతర కారణాలతో పాటు సిజేరియన్ ప్రసవాలకు కూడా దారితీయవచ్చు. సిజేరియన్‌ ప్రసవాలలో మత్తు ప్రభావం వల్ల డెలివరీ అయిన కొద్ది గంటల వరకు తల్లి స్పృహలోకి వచ్చే అవకాశం ఉండదు. ఇది శిశువుకు తల్లి స్పర్శను, పాలను పట్టడం ప్రారంభించేందుకు అడ్డంకిగా మారుతుంది. ఈ పరిస్థితి పాలు పట్టడంపై తల్లులలో విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలిసింది,” అని నిపుణులు తెలిపారు. ఆరోగ్య కేంద్రాలలో తల్లిపాలు పట్టడానికి తగినంత మద్దతు లేకపోవడం, శిశువుల పాల ప్రత్యామ్నాయాలు, బేబీ ఫుడ్స్‌ను దూకుడుగా వాణిజ్యపరంగా మార్కెటింగ్ చేయడం వంటివి దేశంలో సరైన శిశు పోషణ పద్ధతులను దెబ్బతీస్తున్నాయని బీపీఎన్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. శిశువుల ఫార్ములా, వాణిజ్యపరమైన బేబీ ఫుడ్స్, ఇతర ఆహార ఉత్పత్తుల డిజిటల్, పరోక్ష మార్కెటింగ్ అపూర్వంగా విస్తరించడం అనేది ఫార్ములా ఫీడింగ్‌ను సాధారణీకరించి, తల్లిపాలు పట్టే పద్ధతులపై విశ్వాసాన్ని బలహీనపరుస్తుందని అది హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -